టిఆర్ఎస్‌ అభ్యర్ధి రాజయ్య భవిష్యత్ తేలేది నేడే

October 01, 2018


img

టిఆర్ఎస్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌ అభ్యర్ధి టి.రాజయ్య భవిష్యత్ నేడు తేలబోతోంది. ఆయనకు టికెట్ కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అసమ్మతి నేతలతో నేడు మంత్రి కేటీఆర్‌ భేటీ అవబోతున్నారు. రాజయ్యకు టికెట్ ఇవ్వడాన్ని టిఆర్ఎస్‌ సీనియర్ నేత రాజరాపు ప్రతాప్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఒకవేళ రాజయ్యను మార్చకపోతే  తాను స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి ఆయనను ఓడిస్తానని ప్రకటించారు. రాజయ్య స్థానంలో కడియం శ్రీహరి పోటీ చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. అయితే ఎట్టి పరిస్థితులలో రాజయ్యను మార్చే ప్రసక్తి లేదని టిఆర్ఎస్‌ అధిష్టానం తరపున ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ స్పష్టం చేశారు.  ఈ నేపద్యంలో సోమవారం స్టేషన్‌ఘన్‌పూర్‌ అసమ్మతి నేతలతో మంత్రి కేటీఆర్‌ భేటీ చాలా కీలకంగా మారనుంది.

ఒకవేళ టిఆర్ఎస్‌ అసమ్మతి నేతలను కేటీఆర్‌ ఒప్పించగలిగినా రాజయ్యపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నవారు ఆయనకు సహకరిస్తారనే నమ్మకం లేదు. ఒకవేళ వారిని ఒప్పించలేకపోతే రాజరాపు ప్రతాప్ ఎన్నికలలో పోటీ చేయవచ్చు. కడియం శ్రీహరికి టికెట్ కేటాయిస్తే ఆయనకు మద్దతు ఇస్తామని రాజరాపు ప్రతాప్ వర్గం చెపుతోంది కనుక రాజయ్యను మార్చే ఆలోచన చేసినా చేయవచ్చు. కనుక ఏవిధంగా చూసినా టిఆర్ఎస్‌ అభ్యర్ధి రాజయ్యకు అసమ్మతి నేతల నుంచి ఎంతో కొంత ఇబ్బంది తప్పదని అర్ధమవుతోంది.


Related Post