మహాకూటమి సీట్ల సర్దుబాటు ఇంకా కాలేదు: ఉత్తమ్

September 29, 2018


img

రాష్ట్రంలో మహాకూటమిగా ఏర్పడిన కాంగ్రెస్‌, టిడిపి, టిజెఎస్, సిపిఐ పార్టీల నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్ రమణ, కోదండరామ్, చాడా వెంకటరెడ్డి తదితరులు శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని హోటల్ గోల్కొండలో సమావేశం అయ్యారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఇవాళ్ళ సమావేశంలో కామన్ మినిమమ్ అజెండాపై చర్చించుకొన్నాము. సీట్ల సర్ధుబాట్లపై ఎటువంటి చర్చలు జరుపలేదు. ముందుగా కామన్ మినిమమ్ అజెండాను రూపొందించుకొన్న తరువాత మిగిలిన అంశాలపై చర్చిస్తాము. ఇంకా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదు కనుక సీట్ల సర్ధుబాటులో మేమేవరం తొందరపడటం లేదు. నాలుగు పార్టీలకు ఆమోదయోగ్యంగానే అన్ని సర్దుబాటు చేసుకొని కలిసి ముందుకు సాగుతాము.” అని చెప్పారు.

తరువాత మాట్లాడిన కోదండరామ్ “ఉద్యమ ఆకాంక్ష, ప్రజల ఆకాంక్షలు ఈ నాలుగేళ్ళలో నెరవేరలేదు. మా మహాకూటమి మొదటి లక్ష్యం అదే ఉంటుంది. తరువాత ప్రభుత్వంలో నెలకొన్న నిరంకుశత్వాన్ని తొలగించడం మా రెండవ లక్ష్యం. వీటికి అనుగుణంగానే కామన్ మినిమమ్ అజెండాను రూపొందించుకొంటున్నాము. మహాకూటమి సమిష్టి నాయకత్వంలోనే నడుస్తుంది తప్ప ఎవరో ఒకరి చేతిలోనే ఉండదు. సీట్ల సర్ధుబాట్లపై ఇంకా చర్చించలేదు. అజెండా ఖరారు అయిన తరువాత దాని గురించి మాట్లాడుకొంటాము. మహాకూటమి తప్పకుండా విజయవంతమైన ప్రయోగంగా నిలుస్తుందని భావిస్తున్నాను,” అని అన్నారు. 

నాలుగు భిన్నమైన రాజకీయ పార్టీలు కలిసి పనిచేయాలంటే కామన్ మినిమమ్ అజెండా ద్వారా విధివిధానాలు రూపొందించుకోవడం అవసరమే. అయితే పార్టీలు కలిసి పనిచేయాలంటే ముందుగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయంపై ఒక అంగీకారానికి రావలసి ఉంటుంది. అది కుదిరితే కామన్ మినిమమ్ అజెండా రూపొందించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ సీట్ల సర్దుబాట్లు చాలా క్లిష్టమైన విషయం. కనుక ముందుగా నాలుగు పార్టీల నేతల పరస్పర అవగాహన పెంచుకొనేందుకే అజెండా పేరుతో సమావేశం అవుతున్నారని భావించవచ్చు. 


Related Post