బతుకమ్మ చీరల పంపిణీ చేయవచ్చా?

September 29, 2018


img

బతుకమ్మ పండుగ సందర్భంగా అక్టోబర్ 12 నుంచి రాష్ట్రంలో పేద మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అవుతోంది. గత ఏడాది నాసి రకమైన చీరలు పంపిణీ చేసి మహిళల ఆగ్రహానికి గురైన ప్రభుత్వం ఈసారి మహిళలను ఆకట్టుకొనేవిదంగా చాలా నాణ్యమైన, ఆకర్షణీయమైన రంగురంగులలో నేయించిన చీరలను పంచబోతోంది. ఒకవేళ రాష్ట్రంలో ఎన్నికలు లేకపోయుంటే ఎవరూ దానిని తప్పు పట్టేవారు కాదు. కానీ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఓటరాళ్ను ప్రభావితం చేయగల బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లేనని కాంగ్రెస్‌ నేత గూడూరు నారాయణరెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఒకవేళ ఈ చీరల పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతించినట్లయితే, ఆ కార్యక్రమంలో టిఆర్ఎస్‌ నేతలు, మంత్రులు ఎవరూ పాల్గొనకూడదని, సిఎం కెసిఆర్‌ ఫోటో ఎక్కడా ప్రదర్శించకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. 

బతుకమ్మ చీరల పంపిణీ పాత పధకమే కనుక ఎన్నికల సంఘం వాటి పంపిణీకి అభ్యంతరం చెప్పకపోవచ్చు. కనుక సరిగ్గా ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా టిఆర్ఎస్‌ నేతలు ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేయవచ్చునని కాంగ్రెస్‌ నేతలు భయపడటం సహజమే. చీరల పంపిణీ తరువాత రైతుబంధు పధకం క్రింద రైతులకు రూ.4,000 చెక్కులు పంపిణీ కార్యక్రమం కూడా ఉంది. దాని తరువాత నిర్మాణాలు పూర్తి చేసుకొన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పంపిణీ కార్యక్రమం కూడా ఉంది. ఇవన్నీ ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేసేవే కనుక వీటన్నిటిపై ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయాలు తీసుకొంటుందో చూడాలి.


Related Post