టిఆర్ఎస్‌ ఎన్డీయేలో చేరబోతోందా?

September 28, 2018


img

మంత్రి కేటీఆర్‌ ఈరోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “కేంద్రంలో ఇక ఎప్పటికీ సంకీర్ణ ప్రభుత్వాలే సాగుతాయి తప్ప ఒకే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కనుక రానున్న రోజులలో టిఆర్ఎస్‌ కూడా కేంద్రంలో కీలకపాత్ర పోషించబోతోంది. మోడీ సర్కారుపై పెట్టుకొన్న ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఇక రాహుల్ గాంధీ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్‌ పని ఖలాస్ అయిపోతుంటుంది. బిహెచ్ఈఎల్ కంపెనీ బంగారం తయారుచేస్తుందని చెప్పారు. అటువంటి వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయితే ఇక దేశం పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. కాంగ్రెస్‌, బిజెపిలు రెండూ పూర్తిగా వైఫల్యం చెందాయి కనుక లోక్‌సభ ఎన్నికల తరువాత కేంద్రంలో సరికొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. దానిలో టిఆర్ఎస్‌ కీలక పాత్ర పోషిస్తుంది,” అని అన్నారు. 

కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్థానాని సిఎం కెసిఆర్‌ చెప్పారు కానీ ఇంతవరకు చేయలేకపోయారు. కారణాలు అందరికీ తెలిసినవే. లోక్‌సభ ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు కనుక ఆలోగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు అయ్యే అవకాశాలే లేవని చెప్పవచ్చు. మరి లోక్‌సభ ఎన్నికల తరువాత టిఆర్ఎస్‌ జాతీయ రాజకీయాలలో ఏవిధంగా చక్రం తిప్పాలనుకొంటోంది? అంటే యూపీయే లేదా ఎన్డీయే కూటమిలో చేరడం ద్వారా మాత్రమే అది సాధ్యమని అర్ధమవుతోంది. 

ప్రధాని మోడీతో సిఎం కెసిఆర్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. వారిరువురి మద్య మంచి అవగాహన ఏర్పడింది.  కనుక ఆయన లోక్‌సభ ఎన్నికల తరువాత అవసరమైతే ఎన్డీయే కూటమివైపు మొగ్గు చూపవచ్చు. 

వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాల నుంచి ఎన్డీయే కూటమికి గట్టి పోటీ ఎదుర్కోవలసి వస్తుంది కనుక ఒకవేళ ఎన్డీయే కూటమికి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైనన్ని లోక్‌సభ స్థానాలు గెలుచుకోలేకపోతే సిఎం కెసిఆర్‌ దానికి మద్దతు ఇచ్చి లేదా మద్దతు కూడగట్టి  ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించవచ్చు. అందుకు ప్రతిగా టిఆర్ఎస్‌ ఎన్డీయే కూటమిలో చేర్చి కేంద్రమంత్రి పదవి తీసుకొన్నా ఆశ్చర్యం లేదు. అప్పుడు కేటీఆర్‌ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించవచ్చు. ఫెడరల్‌ ఫ్రంట్‌ తో ఇవన్నీ సాధ్యంకావు కనుక లోక్‌సభ ఎన్నికల తరువాత బహుశః ఇదే జరుగవచ్చు.


Related Post