ముందస్తుపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ

September 28, 2018


img

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలను సవాలు చేస్తూ సిద్ధిపేటకు చెందిన శశాంక్ రెడ్డి అనే వ్యక్తి వేసిన పిటిషనుపై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ముందస్తు ఎన్నికల కోసమే హడావుడిగా ఓటర్ల జాబితా గడువును కుదించడం సరికాదని, హడావుడిగా ఎన్నికలు నిర్వహించడం వలన పారదర్శకత లోపిస్తుందని పిటిషనర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 

ముందుగా నిర్ణయించినట్లు జనవరి 2019 వరకు ఓటర్ల తుది జాబితా ఖరారు చేసినట్లయితే అప్పటికి 18 ఏళ్ళు వయసు నిండేవారు సుమారు 20 లక్షల మంది ఉంటారు కనుక వారందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని, కానీ గడువు కుదించడం వలన అంతమంది తమ ఓటుహక్కును కోల్పోతారని పిటిషనర్ వాదించారు. కనుక గడువు ప్రకారమే ఓటర్ల జాబితాను ఖరారు చేసి ఆ తరువాతే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమీషన్, తెలంగాణా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ఆయన వేసిన ఈ పిటిషనుకు వారం రోజులలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల కమీషన్, తెలంగాణా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీసులు పంపించి ఈ కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. 

నిజానికి జనవరి 2019 వరకు ఆగితే మరో 20 లక్షల మందికి ఓటు హక్కు లభిస్తుంది కనుక ఎన్నికలను వాయిదా వేయాలని కోరడం అర్ధరహితం. ఎందుకంటే మరో నెల లేదా మూడు నెలలు ఆగితే ఇంకా అనేక లక్షల మంది కొత్త ఓటర్లు పెరుగుతారు. కానీ పిటిషనర్ వాదనను సుప్రీంకోర్టు ఎందుకు స్వీకరించిందంటే, ఎన్నికల కమీషన్ మొదట జనవరి 2019 గడువు పెట్టుకొని ఓటర్ల నమోదు కార్యక్రమం మొదలుపెట్టింది. కానీ తెలంగాణా శాసనసభ రద్దు కాగానే ఆ గడువును ఏకంగా 3 నెలలకు కుదించి అక్టోబర్ 8తో ఓటర్ల జాబితాను హడావుడిగా ఖరారు చేయడానికి సిద్దపడింది. అందుకే అందరూ ప్రశ్నించగలుగుతున్నారు. 

శాసనసభ రద్దయిన తరువాత సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలనే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకొన్నామని ఈసీ వాదిస్తోంది. ఇప్పుడు అదే ముక్క సుప్రీం కోర్టుకు చెప్పి అంగీకరింపజేయవలసి ఉంటుంది.


Related Post