రేవంత్ రెడ్డి ఛాప్టర్ ముగిసినట్లేనా?

September 28, 2018


img

తెలంగాణా కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, బందువులు, స్నేహితులు, అనుచరుల ఇళ్ళపై ఐటి దాడులు రెండో రోజు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఆర్ధిక వ్యవహారాల గురించి ఐటి అధికారులు బయటపెట్టిన వివరాలు, ఆయనపై నమోదు చేస్తున్న కేసులను చూస్తే రాష్ట్ర రాజకీయాలలో రేవంత్ రెడ్డి ఛాప్టర్ ముగిసిపోనుందా? అనే సందేహం కలుగుతోంది. టిఆర్ఎస్‌కు రేవంత్ రెడ్డి పక్కలో బల్లెంలా మారినందునే సిఎం కెసిఆర్‌ ఈవిదంగా కేంద్రం సహాయసహకారాలతో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. 

రేవంత్ రెడ్డిపై ఐటి దాడులను రెండు కోణాలలో నుంచి చూడవలసి ఉంటుంది. ఒకవేళ ఐటి అధికారులు పేర్కొన్నట్లు రేవంత్ రెడ్డి అక్రమంగా ఆర్ధికలావాదేవీలు జరుపుతూ భారీగా ఆస్తులు పోగేయడం నిజమైతే చట్టప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. ఎన్నికలు జరుగుతున్నాయి కనుక చేసిన చేసిన నేరాలపై కేసులు నమోదు చేయకూడదు...చట్ట ప్రకారం చర్యలు తీసుకోకూడదు...అలాచేస్తే అది రాజకీయ కక్ష సాధింపేనని వాదించడం సరికాదు. ఒకవేళ రేవంత్ రెడ్డి ఎటువంటి ఆర్ధిక నేరమూ చేసి ఉండకపోతే న్యాయస్థానంలో పోరాడి న్యాయం పొందవచ్చు. 

ఇక రెండవ కోణంలో నుంచి చూసినట్లయితే, ఎప్పుడో 2004లో రేవంత్ రెడ్డిపై దర్యాప్తు మొదలుపెట్టి సరిగ్గా ఇప్పుడు కీలకమైన ఎన్నికలకు ముందు ఆయనపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలనుకోవడం నీచ రాజకీయమేనని చెప్పక తప్పదు. రాష్ట్రంలో ప్రజలందరూ టిఆర్ఎస్‌ వైపే ఉన్నారని ఈసారి 100 సీట్లు గెలుచుకొంటామని సిఎం కెసిఆర్‌తో సహా టిఆర్ఎస్‌ నేతలు బల్లగుద్ధి వాదిస్తున్నప్పుడు, కాంగ్రెస్‌ నేతల పాత కేసులు తిరగదోడి వారిని జైళ్లకు పంపించాలనుకోవడం దేనికి? అంటే టిఆర్ఎస్‌ గెలుస్తుందనే నమ్మకం లేదనుకోవాలా? 

ఒకవేళ రేవంత్ రెడ్డి ఆరోపించిన్నట్లు సిఎం కెసిఆర్‌ ప్రధాని మోడీపై ఒత్తిడి తెచ్చి ఐటిి దాడులు చేయించడం నిజమే అయితే రాష్ట్రంలో ఒక సరికొత్త విష సంస్కృతికి టిఆర్ఎస్‌ శ్రీకారం చుట్టినట్లే భావించవచ్చు. దీనిని అమలులోకి తీసుకువస్తే మున్ముందు ఎవరు అధికారంలో ఉన్నా వారు తమ రాజకీయ ప్రత్యర్ధులను అణచివేయడానికి ఇదే విధానం అవలంభిస్తారు కనుక అప్పుడు రాజకీయాలలో ఉన్నవారే బలవుతుంటారు. అందరూ ఏదో ఒకరోజున ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొకతప్పదు. 

చివరిగా...రేవంత్ రెడ్డిపై ఐటి దాడులు జరగడాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు కానీ వాటికి ఐటి  అధికారులు ఎంచుకొన్న సమయమే ఇవి రాజకీయ ప్రేరేపితమైనవని ప్రజలు సైతం అనుమానిస్తున్నారు.


Related Post