రాజయ్యకు డిపాజిట్ కూడా రాదు: ప్రతాప్

September 28, 2018


img

టిఆర్ఎస్‌ అభ్యర్ధుల మొదటి జాబితా విడుదలయ్యి సుమారు మూడు వారాలు అవుతున్నా పార్టీలో ఇంకా అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి టికెట్ దక్కించుకొన్న టి. రాజయ్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టిఆర్ఎస్‌ నేత రాజరాపు ప్రతాప్ తాను స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయడం ఖాయం అని చెప్పారు. మీరు మద్దతు ఇస్తున్నట్లు రాజయ్య చెప్పుకొంటున్నారు కదా? అని విలేఖరి ప్రశ్నించగా, “నేను అక్కడి నుంచి పోటీ చేయాలనుకొంటున్నప్పుడు రాజయ్యకు ఎందుకు మద్దతు ఇస్తాను? గత నాలుగేళ్ళుగా ఈ నియోజకవర్గం ప్రజలు, టిఆర్ఎస్‌ కార్యకర్తలు అందరూ రాజయ్య వలన చాలా బాధలు పడ్డాము. అటువంటి వ్యక్తి ఇక్కడి నుంచి పోటీ చేస్తే కనీసం డిపాజిట్ కూడా లభించదు. నేను లక్ష ఓట్లు మెజార్టీతో గెలిచి స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాన్ని సిఎం కెసిఆర్‌కు బహుమానంగా ఇస్తాను,” అని చెప్పారు. 

రాజయ్యకు స్థానిక టిఆర్ఎస్‌ నేతలు, కార్యకర్తలు సహకరించడం లేదనేది వాస్తవం. కానీ టిఆర్ఎస్‌ అధిష్టానం మద్దతు రాజయ్యకే ఉంది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా రాజయ్యకు మద్దతు తెలిపారు. ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ సిఎం కెసిఆర్‌ ఆదేశం మేరకు రాజయ్య తరపున స్టేషన్‌ఘన్‌పూర్‌లో మొదటి విడత ఎన్నికల ప్రచారం చేసి వెళ్ళారు. 

కనుక స్టేషన్‌ఘన్‌పూర్‌లో టిఆర్ఎస్‌ ఒక విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. పార్టీ అభ్యర్ధి రాజయ్య స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నప్పటికీ పార్టీ అండదండలున్నాయి. కనుక సిఎం కెసిఆర్‌ మొహం చూసి స్టేషన్‌ఘన్‌పూర్‌ ప్రజలు రాజయ్యకే ఓట్లేస్తారా? లేక స్థానికంగా మంచి పేరు, బలం ఉన్న ప్రతాప్ కు ఓటేస్తారా?అలాగే టిఆర్ఎస్‌ అధిష్టానం మాట మన్నించి ప్రతాప్ పోటీ నుంచి తప్పుకొంటారా? తప్పుకొన్నా రాజయ్య గెలుపుకు సహకరిస్తారా లేదా? అన్నీ ప్రశ్నలే కనిపిస్తున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ఇంకా మొదలవలేదు కనుక ఆలోగా ఏమి జరుగుతుందో చూడాలి. 


Related Post