రాజగోపాల్ రెడ్డి వెనక్కు తగ్గినట్లే...కనుక..

September 27, 2018


img

రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వాన్ని... కాంగ్రెస్‌ సీనియర్ నేతలను...వారితో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ కమిటీలను దుమ్ము దులిపేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాలుగు రోజులు గడిచేసరికి మెత్తబడ్డారు. ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రామచంద్ర కుంతియాకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. అయితే ఫోన్ ద్వారా కాక లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని కుంతియా చెప్పినట్లు సమాచారం. ఈరోజు సమావేశం అయిన క్రమశిక్షణ కమిటీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం గురించి చర్చించినప్పటికీ ఎటువంటి నిర్ణయమూ తీసుకోకపోవడం గమనిస్తే కాంగ్రెస్‌ పార్టీ కూడా మెత్తబడినట్లే ఉంది. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ, “గత నాలుగేళ్ళుగా టిఆర్ఎస్‌ నుంచి తీవ్ర ఒత్తిళ్ళు ఎదుర్కొంటూ పార్టీని కాపాడుకోవడం కోసం పనిచేస్తున్నవారికి ప్రాధాన్యం ఇచ్చి వారికి సముచిత పదవులు ఇవ్వాలన్నదే నా ఆవేదన. నేను ఏదో ఆవేశంలో మాట్లాడినదానికి కొందరు రాద్దాంతం చేస్తున్నారు. ఒకవేళ పార్టీ నాపై ఎటువంటి చర్యలు తీసుకోదలచినా నేను దాని నిర్ణయాన్ని శిరసావహిస్తాను. ఇప్పటికీ నేను చెప్పేది ఏమిటంటే ఈసారి మన పార్టీకి విజయావకాశాలు బాగా ఉన్నాయి. కనుక అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించుకోవాలి. అందుకోసం గెలిచే అభ్యర్ధులకె టికెట్లు ఇవ్వాలి. పొత్తుల కోసం మనకు బలం ఉన్న స్థానాలను ఇతర పార్టీలకు వదులుకోవడం సరికాదని నా అభిప్రాయం. నాకు మునుగోడు నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తే భారీ మెజార్టీతో గెలిచి చూపిస్తాను,” అని చెప్పారు. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మెత్తబడ్డారు. పార్టీ కూడా మెత్తబడింది కనుక ఈ సమస్య సమసిపోయినట్లేనని భావించవచ్చు. అలాగే ఈ ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాంగ్రెస్‌ లక్ష్యంగా భావిస్తోంది కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ కేటాయించినా ఆశ్చర్యం లేదు.


Related Post