ఇప్పుడీ ట్విస్ట్ ఏమిటి?

September 26, 2018


img

తెలంగాణాలో ముందస్తు ఎన్నికల కోలాహలం మొదలైపోయి అప్పుడే 3 వారాలవుతోంది. మరో 10-15 రోజులలో ఎన్నికల షెడ్యూల్ లేదా నోటిఫికేషన్ వెలువడబోతోంది. ఎన్నికలు తెలంగాణా గడప వరకు వచ్చేసిన తరువాత కేంద్రప్రభుత్వం అనూహ్యమైన ట్విస్ట్ ఇవ్వడానికి సిద్దపడుతోంది. గత నాలుగేళ్ళుగా రెండు తెలుగు రాష్ట్రాలలో శాసనసభ స్థానాలను జనాభా ప్రాతిపాదికన పెంచాలని ముఖ్యమంత్రులు కెసిఆర్‌, బాబు ఎంత మొత్తుకొన్నా పట్టించుకోని కేంద్రప్రభుత్వం, ఇప్పుడు హటాత్తుగా అందుకు సిద్దం అవుతోంది. 

రెండు తెలుగు రాష్ట్రాలలో శాసనసభ స్థానాలు పెంచడానికి ఏ కేటగిరీకి ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి...వాటిని ఎన్ని నియోజకవర్గాలకు వర్తింపజేయాలి...మొదలైన వివరాలను పంపించవలసిందిగా కేంద్ర హోంశాఖ కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఒక లేఖ వ్రాసింది. దీనిపై ఎన్నికల కమీషన్ జవాబు చూసిన తరువాత కేంద్ర హోంశాఖ తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. 

అక్టోబర్ 8 నాటికి తెలంగాణా రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితా ఖరారు చేసి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని ఎన్నికల కమీషన్ భావిస్తుంటే హోంశాఖ ఈ ప్రతిపాదన ముందు పెట్టడం చాలా ఆశ్చర్యకరమే. శాసనసభ స్థానాలను పెంచడం అంటే ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను పునర్విభజన చేయాల్సి ఉంటుంది. ఇంత తక్కువ సమయంలో అది సాధ్యం అవుతుందా అంటే కష్టమేనని అర్ధమవుతోంది. కనుక  తెలంగాణా శాసనసభ ఎన్నికలను మరికొన్ని నెలలు వాయిదా వేయడానికే ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందా లేక నియోజకవర్గాల పెంపుకు టిఆర్ఎస్‌ సర్కారు కూడా ఇప్పటికే కసరత్తు పూర్తి చేసి కేంద్రానికి పంపించిందా? కనుక ముందస్తు ఎన్నికల సమయానికే శాసనసభ స్థానాలను పెంచుతామని ప్రధాని మోడీ సిఎం కెసిఆర్‌కు హామీ ఇచ్చినందునే ఈ ప్రయత్నం మొదలుపెట్టిందా? అనేది రానున్న రోజులలో తెలియవచ్చు.


Related Post