ఉత్తమ్ సరే...లక్ష్మణ్ కూడా పగటి కలలు కంటున్నారా?

September 26, 2018


img

టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌ కార్యకర్తలతో మాట్లాడుతూ మరొక 60 రోజులు గట్టిగా కష్టపడితే తరువాత మనమే రాష్ట్రంలో అధికారంలోకి వస్తాము. అప్పుడు అందరి కష్టాలు తీరిపోతాయి,” అని చెప్పారు. 

దీనిపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె లక్ష్మణ్ స్పందిస్తూ, “ఉత్తమ్ కుమార్ రెడ్డి పగటికలలు కంటున్నారు. టిఆర్ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కొనే శక్తిలేకనే టిడిపి, టిజెఎస్, సిపిఐ పార్టీలతో పొత్తులు పెట్టుకొన్న సంగతి మరిచిపోయి, మహాకూటమే విజయం సాధించి అధికారంలోకి వస్తుందని కార్యకర్తలకు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అది మహాకూటమి కాదు మహా విచిత్రకూటమి...మహా విషకూటమి. అధికార యావతోనే వారు చేతులు కలిపారు కానీ వారి కూటమిని రాష్ట్ర ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించబోతున్నారు,” అని అన్నారు. 

ఇటీవల మంత్రి హరీష్ రావు సిద్ధిపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ‘ప్రజల అభిమానం పొందుతున్న ఈ సమయంలోనే రాజకీయాల నుంచి తప్పుకోవాలనిపిస్తోంది,” అన్నారు. దానిపై లక్ష్మణ్ స్పందిస్తూ, “టిఆర్ఎస్‌లో ఆధిపత్యపోరు, అంతర్గతపోరాటాలు పరాకాష్టకు చేరుకొన్నాయని హరీష్ రావు మాటలతో అర్ధమవుతోంది. ప్రస్తుతం టిఆర్ఎస్‌ ఒక్కటిగా ఉన్నా భవిష్యత్ లో నిలువునా చీలిపోవడం ఖాయం. ఈసారి ఎన్నికలలో బిజెపి చేతిలో టిఆర్ఎస్‌ చిత్తుగా ఓడిపోబోతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటమి తప్పదు.   రాష్ట్రంలో బిజెపియే అధికారంలోకి వస్తుంది,” అని అన్నారు. 

ఫిరాయింపులు, వరుస ఓటముల తరువాత కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా నిలబడి టిఆర్ఎస్‌కు సవాలు విసురుతోంది. అందుకే ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీయే తమకు ప్రధాన ప్రత్యర్ధి అని ఆ పార్టీతోనే తమకు పోటీ ఉంటుందని మంత్రి కేటీఆర్‌ స్వయంగా చెప్పారు. కనుక కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం పగటికలలో... రాత్రి కలలో కనడంలో తప్పు లేదు. 

“బిజెపి నేతలు కాలక్షేపం కోసం ఏవో గొప్పలు చెప్పుకొంటారు వాళ్ళ సంతోషాన్ని మనం ఎందుకు పాడు చేయాలి?ఈసారి ఎన్నికలలో వారు తమ సీట్లను తాము గెలుచుకోగలిగితే అదే వారికి గొప్ప విషయం అవుతుంది” అని సిఎం కెసిఆర్‌ అన్న మాటలు బిజెపి వాస్తవ పరిస్థితికి అద్ధం పడుతున్నాయి. పార్టీ పరిస్థితిని కళ్ళారా చూస్తూ కూడా లక్ష్మణ్ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని చెప్పడం పగటి కలలు కనడమే కదా?


Related Post