కాంగ్రెస్‌ మెప్పు కోసమే టిఆర్ఎస్‌పై రాళ్ళు: కేటీఆర్‌

September 26, 2018


img

కొండా సురేఖ నిన్న తమపై చేసిన విమర్శలపై మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “పార్టీలో ఉన్నంత కాలం టిఆర్ఎస్‌ ప్రభుత్వం, మేమందరం వాళ్ళకు మంచిగానే కనిపించాము. కానీ పార్టీ విడిచిపెట్టిపోతుంటే మా ప్రభుత్వంలో అన్నీ తప్పులే కనబడుతున్నాయి...అందరం చెడ్డవారిగానే కనబడుతున్నాము. పార్టీని వీడి వెళ్ళిపోయేవారు రాళ్ళు వేయడం సహజమే కానీ వారు చేరబోయే పార్టీని ప్రసన్నం చేసుకోవడానికి మాపై ఇటువంటి నిరాధారమైన విమర్శలు, ఆరోపణలు చేయడం తగునా? అని నేను ప్రశ్నిస్తున్నాను. త్వరలోనే ఎన్నికలు జరుగబోతున్నాయి. అప్పుడు ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో ఎవరికి ఎంత బలం ఉందో ప్రజలే నిర్ణయిస్తారు,” అని అన్నారు. 

కొండా సురేఖకు మొదటి జాబితాలో టికెట్ కేటాయించలేదనే దుగ్ధతోనే విమర్శలు చేస్తున్నారనేది వాస్తవం. టికెట్ ఇవ్వకపోయేసరికి ప్రెస్ మీట్ పెట్టి కెసిఆర్‌, కేటీఆర్‌లను తిట్టిపోశారు. కానీ ఆ తరువాత కూడా టిఆర్ఎస్‌ టికెట్ కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. గణపతి నవరాత్రుల సందర్భంగా వారు తొమ్మిది రోజులపాటు తమ ఇంటికే పరిమితమైనప్పుడు కూడా తమకు టికెట్ ఇప్పించవలసిందిగా కోరుతూ వారు తమ అనుచరుల చేత వరంగల్ లో నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు, సమావేశాలు నిర్వహింపజేయడం అందరూ చూశారు. వారికి అప్పుడు టిఆర్ఎస్‌,  కెసిఆర్‌, కేటీఆర్‌, కవితలలో లోపాలు ఏవీ కనిపించలేదు. కానీ మర్నాటి నుంచి అన్ని లోపాలే కనిపిస్తున్నాయంటే అర్ధం ఏమిటి?


Related Post