మోడీ-కెసిఆర్‌ అనుబందానికి అదే మరో నిదర్శనం: రమణ

September 25, 2018


img

కాంగ్రెస్ పార్టీతో పొత్తులు, సీట్లు సర్దుబాట్లు దాదాపు ఒక కొలిక్కి వస్తుండటంతో టిడిపి నేతలు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ ఈరోజు జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్‌కు రోజులు దగ్గరపడ్డాయి. ఇక్కడి నుంచే మహాకూటమి తొలి జెండా ఎగురవేస్తాము. సీట్ల సర్దుబాట్ల చర్చలు ముగియగానే మా పార్టీ అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తాము. మహాకూటమిపై నోరు పారేసుకొంటున్న టిఆర్ఎస్‌ నేతలు సిఎం కెసిఆర్‌-ప్రధాని మోడీల మద్య ఉన్న రహస్య అనుబంధం గురించి ఎందుకు మాట్లాడరు? రాఫెల్ యుద్ద విమానాల కుంభకోణం గురించి సిఎం కెసిఆర్‌ ఒక్క ముక్క కూడా మాట్లాడటం లేదు. వారి మద్య రహస్య అవగాహన ఉందని చెప్పడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుంది? కెసిఆర్‌ శాసనసభ రద్దు చేసిన తరువాత హడావుడిగా 7వ తేదీన హుస్నాబాద్ లో ఎన్నికల ప్రచారసభ నిర్వహించారు. ఆ తరువాత రోజుకు రెండు చొప్పున మొత్తం 100 బహిరంగసభలు నిర్వహిస్తామని చెప్పారు. కానీ 7వ తేదీ నుంచి కెసిఆర్‌ పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు దేనికో? ఆయనకు ఓటమి భయం పట్టుకోందేమో? ఈసారి ఎన్నికలలో మా మహాకూటమి విజయం సాధించడం, రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం,” అని అన్నారు.

మోడీ-కెసిఆర్‌ మద్య ఉన్న అనుబంధం వలన రాష్ట్రంలో బిజెపి నష్టపోతుండగా టిఆర్ఎస్‌లబ్ధి పొందుతోంది. అదేవిధంగా టిడిపితో పొత్తుల వలన కాంగ్రెస్ పార్టీకి లాభమో నష్టమో ఎన్నికల ఫలితాలు వెలువడితే గానీ తెలియవు. కానీ కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం వలన టిడిపికి ఎంతో కొంత లాభమే జరుగవచ్చు. ఫిరాయింపుల కారణంగా రాష్ట్రంలో పూర్తిగా బలహీనపడిన టిడిపి, కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం చేత ఒకవేళ కాంగ్రెస్‌ గెలిచి అధికారంలోకి వస్తే,  టిడిపి నేతలకు కూడా మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లభిస్తుంది. కానీ ఈసారి ఎన్నికలలో టిఆర్ఎస్‌ కనీసం 100 సీట్లు గెలుచుకొంటుందని సిఎం కెసిఆర్‌ ధీమా వ్యక్తం చేస్తున్నప్పుడు, కాంగ్రెస్‌ టిడిపిలు ఎన్ని సీట్లు గెలుచుకొంటాయో చూడాలి. 


Related Post