మరి టికెట్ కోసం ఎందుకు అంత ఆరాటపడ్డారో?

September 25, 2018


img

కొండా సురేఖ మంగళవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి, సిఎం కెసిఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎంపీ కవిత, టిఆర్ఎస్‌ సర్కారుపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. సిఎం “కెసిఆర్‌ ప్రభుత్వానికి అవినీతి, కమీషన్లు తప్ప మరి దేనిపైన శ్రద్ద లేదు. ఈ నాలుగేళ్ళలో కెసిఆర్‌ కుటుంబ ఖజానా వేలకోట్లతో నిండిపోయింది. ఈ నాలుగేళ్ళలో టిఆర్ఎస్‌ సర్కారును గుర్తు చేయగల గొప్ప పనులు ఒక్కటీ చేయలేదు. మొదలు పెట్టిన ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు కానీ తన కోసం విలాసవంతమైన ప్రగతి భవన్, ఒక ఫాం హౌజ్ నిర్మించుకొన్నారు. ఆ ప్రగతి భవన్ లో కమీషన్లు లభించే ఫైల్స్ మాత్రమే క్లియర్ అవుతుంటాయి. మిగిలినవి ఎప్పటికీ పెండింగులోనే ఉంటాయి. సీ.ఎం.ఓ. కార్యాలయంలో మొత్తం ఎన్ని ఫైల్సు పెండింగులో ఉన్నాయో చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. 

జమిలి ఎన్నికలైతేనే మంచిదని గొప్పలు చెప్పిన సిఎం కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళుతున్నారంటే తన కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడం కోసమే. తెలంగాణాను కుమారుడికి కట్టబెట్టడానికి అదేమీ ఆయన స్వంత ఫాంహౌస్ కాదని గ్రహిస్తే మంచిది. ఆయన కుమార్తె కవిత సమర్పించిన బంగారు బోనం ప్రభుత్వ నిధులతో సమర్పించినదా లేక ఆమె కుటుంబ నిధులతో సమర్పించినదా? ఒకవేళ ప్రభుత్వం తరపున సమర్పించినట్లయితే ఆమె ఏ హోదాతో సమర్పించారు. ఆ బంగారు బోనం ఇప్పుడు ఎక్కడుంది? 

రూపాయి ఖర్చు లేకుండా మీడియా ద్వారా టిఆర్ఎస్‌ సర్కారు సాధించిన ప్రగతి గురించి ప్రజలకు వివరించే అవకాశం ఉన్నప్పటికీ వందల కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి హడావుడిగా ప్రగతి నివేదన సభ నిర్వహించారు. అంతా ఖర్చు చేసినా ఆ సభకు వచ్చిన ప్రజలకు, కార్యకర్తలకు కడుపు నిండా తిండి పెట్టి పంపించలేకపోయారు. ఆ సభకు అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన టిఆర్ఎస్‌ సర్కారు, కొండగట్టు ప్రమాదంలో 60 మంది చనిపోతే వారి శవాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్ బాక్సులను ఏర్పాటు చేయలేకపోయింది. 

ప్రధాని మోడీ, బిజెపిలతో లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకొన్న మీరు (సిఎం కెసిఆర్‌) ప్రతిపక్షాలు పొత్తులు పెట్టుకొంటుంటే ఎందుకు విమర్శిస్తున్నారు? కేంద్రం మెడలు వంచి జోనల్ వ్యవస్థకు ఆమోదముద్ర వేయించుకొన్నామని గొప్పలు చెప్పుకొంటున్న మీరు, ముస్లింలకు మీరిస్తానన్న 12 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రాన్ని ఎందుకు ఒప్పించలేకపోయారు? ముస్లింల పట్ల మీకు నిజంగా అంతా ప్రేమ ఉన్నట్లయితే టిఆర్ఎస్‌ అభ్యర్ధులలో 12 శాతం సీట్లు వారికి కేటాయించవచ్చు కదా? కానీ ఎందుకు కేటాయించలేదు? తెలంగాణా ఉద్యమాలలో అవిశ్రాంతంగా పనిచేసిన కోదండరామ్ ను మీరు, మీ మంత్రులు నోటికి వచ్చినట్లు దూషించడం సమంజసమేనా?,” అంటూ కొండా సురేఖ విమర్శలు, ఆరోపణల వర్షం కురిపించారు.

టిఆర్ఎస్‌ అవినీతి పార్టీ అని భావిస్తున్నపుడు ఆమె టిఆర్ఎస్‌ టికెట్ల కోసం ఎందుకు అంతా ఆరాటపడ్డారో కూడా చెపితే బాగుండేది. ఆమెకు టికెట్లు ఇస్తే టిఆర్ఎస్‌ మంచిది లేకుంటే అవినీతి పార్టీ అయిపోతుందా? గత నాలుగేళ్ళుగా టిఆర్ఎస్‌లో ఉన్నప్పుడూ ఆమెకు ఈ అవినీతి, అక్రమాలు కనబడలేదా? కనబడినా మౌనం వహించారంటే అర్ధం ఏమిటి? రాజకీయ నాయకులు పార్టీని వీడాలనుకొన్నప్పుడు ఇటువంటి ఆరోపణలు చేయడం సహజమే. కానీ వారికీ ఆ బురద అంటుకొనే ఉందన్న సంగతి అసలు తెలియనట్లు మాట్లాడుతుంటారు. కొండా సురేఖ అందుకు అతీతం కాదని నిరూపించుకొన్నారు.


Related Post