హంతకుడికి మద్దతుగా మిర్యాలగూడలో ర్యాలి!

September 25, 2018


img

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ కుమార్ హత్యకేసులో అరెస్ట్ చేయబడిన ఇద్దరు ప్రధాన నిందితులు మారుతీ రావు, ఆయన సోదరుడు శ్రవణ్ లకు మద్దతుగా ఆర్యవైశ్య సంఘం, తల్లితండ్రుల పరిరక్షణ వేదిక అధ్వర్యంలో సోమవారం మిర్యాలగూడలో ర్యాలీ నిర్వహించడం చూసి పట్టణ ప్రజలు అందరూ షాక్ అయ్యారు. వారు పట్టణంలోని వాసవీ భవన్ నుంచి జైలు వరకు ర్యాలీ నిర్వహించి, జైలులో ఉన్న మారుతీ రావు, శ్రవణ్ లను కలిసి వారికి సంఘీభావం తెలిపారు. అనంతరం వారు జైలు నుంచి కలెక్టరేట్ కార్యాలయానికి, అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్ళి ప్రణయ్ కుమార్ విగ్రహం పెట్టడానికి అనుమతించవద్దని వినతి పత్రాలు అందజేశారు. ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చేసినట్లయితే తల్లి తండ్రుల మనోభావాలు దెబ్బ తింటాయని వారు జిల్లా కలెక్టరుకు, ఎస్పీకి తెలిపారు. 

కులం పిచ్చితో స్వంత అల్లుడిని హత్య చేయించి తన జీవితాన్ని అంధకారం చేసిన తన తండ్రికి, చిన్నాన్నలకు ఉరి శిక్ష విధించాలని మారుతీరావు కుమార్తె అమృత వర్షిణి కోరుతుంటే, ఈ హత్య తరువాత కొత్తగా పుట్టుకు వచ్చిన ‘తల్లితండ్రుల పరిరక్షణ వేదిక’ పేరుతో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు మారుతీరావుకు మద్దతుగా ర్యాలీ నిర్వహిచడం, జైలులో ఉన్న ఆయనకు సంఘీభావం ప్రకటించడం విస్మయం కలిగిస్తోంది. మారుతీరావు చేయించిన  హత్య కంటే ఒక హంతకుడికి మద్దతుగా ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ర్యాలీ నిర్వహించడం చూసి ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. అలాగే అమృతవర్షిణి గట్టిగా ఖండిస్తున్నప్పటికీ కొందరు వ్యక్తులు పట్టణంలో జాతీయ నేతల విగ్రహాల నడుమ ప్రణయ్ కుమార్  విగ్రహం ఏర్పాటు చేసి ఈ సమస్యను రాజకీయం చేయాలనుకోవడం చాలా విచారకరం. ఈ పరిణామాలన్నీ ప్రశాంతంగా ఉండే మిర్యాలగూడ పట్టణంలో కులాల మద్య చిచ్చుపెట్టేలా ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 


Related Post