మోత్కుపల్లి శంఖారావం దేనికో?

September 25, 2018


img

టిడిపి బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు యాదగిరిగుట్టలో పాత ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ‘మోత్కుపల్లి  శంఖారావం’ పేరుతో బహిరంగసభ నిర్వహించబోతున్నారు. అది గోదావరిజల సాధన కోసమని చెపుతున్నప్పటికీ, ఆయన ఎన్నికల ప్రచారసభ అని సభ పేరే తెలుపుతోంది. ఈసారి ఆయన జిల్లాలో ఆలేరు నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆలేరు ప్రజల ఆత్మగౌరవం కోసమే తాను పోటీ చేస్తున్నానని, మళ్ళీ ఇక ఎన్నికలలో పోటీ చేయబోనని ఇదే చివరిసారి అని, కనుక ఆలేరు నియోజకవర్గం ప్రజలు తనను గెలిపించవలసిందిగా కోరారు. 

గవర్నర్ పదవి కోసం మూడేళ్ళపాటు ఆశగా ఎదురుచూస్తూ ఇంట్లో కూర్చోన్న మోత్కుపల్లికి ఇక అది లభించదని అర్ధమైన తరువాత మళ్ళీ బయటకు వచ్చేసరికి టిటిడిపిలో ఆయన వెనుకబడిపోయారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్దపడుతున్న రేవంత్ రెడ్డి, ఆ పార్టీతో టిడిపి పొత్తులు పెట్టుకోవాలని సూచించడం, అది చంద్రబాబు ఆలోచనే అని తెలుసుకోకుండా మోత్కుపల్లి ఆ ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించారు. అంతటితో ఆగకుండా తొందరపడి టిడిపిని టిఆర్ఎస్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. దాంతో తన రాజకీయ పునఃప్రవేశానికి బలమైన పునాది వేసుకోవాలని మోత్కుపల్లి  అనుకొంటే, అదే ఆయన కొంప ముంచింది. ఈ ప్రతిపాదనతో టిఆర్ఎస్‌ నుంచి తనకు ఆహ్వానం వస్తుందనుకొంటే అది రాకపోగా టిడిపి నుంచి బహిష్కరించబడ్డారు. అప్పటి నుంచి ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న చివరికి ఆలేరు నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలని నిర్ణయించుకొన్నారు. 

ఆయన తన రాజకీయ భవిష్యత్ కోసమే పోటీ చేస్తూ ఆలేరు ప్రజల ఆత్మగౌరవం కోసమని చెప్పడం విడ్డూరంగా ఉంది. నేడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలే తమ నియోజకవర్గాలకు ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడూ ఇక స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మోత్కుపల్లి  ఏమి చేయగలరు?ఒకవేళ గెలిచినా అప్పటి పరిస్థితులను బట్టి ఆయన కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌లలో దేనికో ఓ దానికి మద్దతు ఇవ్వకుండా ఉంటారా?ఇవ్వకపోతే ఆయన పరిస్థితి ఏమిటి? ఆయనను ఎన్నుకొన్న ఆలేరు ప్రజల పరిస్థితి ఏమిటి? అని ఆలోచించవలసి ఉంది. 


Related Post