కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకోమని ఎవరు చెప్పారు?

September 24, 2018


img

తెలంగాణా జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ అమరవీరుల ఆకాంక్షలను నెరవేర్చేందుకే కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొంటున్నామని చెప్పడాన్ని మంత్రి కేటీఆర్‌ తప్పు పట్టారు. తెలంగాణా యువతను పొట్టనపెట్టుకొన్న కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోమని ఏ అమరవీరుడు చెప్పారని కేటీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణా సిద్దాంతకర్త స్వయంపాలన కావాలని కోరుకొంటే, కోదండరామ్ రాష్ట్రాన్ని డిల్లీ కాంగ్రెస్‌ పెద్దల చేతిలో లేదా అమరావతిలో చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టడానికి సిద్దపడుతుండటం సిగ్గుచేటు అని అన్నారు. తెలంగాణా ప్రాజెక్టులను అడ్డుకొంటున్న కాంగ్రెస్‌, టిడిపిలతో చేతులు కలపడం ద్వారా కోదండరామ్ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇస్తున్న హామీలను ముందు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో అమలుచేసి చూపించాలని కేటీఆర్‌ సవాలు విసిరారు. 

అయితే ఒకప్పుడు అదే కాంగ్రెస్‌, టిడిపిలతో టిఆర్ఎస్‌ కూడా పొత్తులు పెట్టుకొన్న సంగతిని మంత్రి కేటీఆరే స్వయంగా ప్రస్తావించి, “అప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రం ఇస్తామంటే దానితో పొత్తులు పెట్టుకొన్నం. కానీ అది మోసం చేయడంతో దానికి బుద్ది చెప్పడానికే టిడిపితో పొత్తులు పెట్టుకొన్నాము. అప్పుడు తెలంగాణా ఏర్పాటుకు టిడిపి అంగీకరించి కేంద్రప్రభుత్వానికి లేఖ కూడా వ్రాసింది. కానీ రెండు పార్టీలు తెలంగాణా ప్రజలను వంచించాయి. అందుకే గత ఎన్నికలలోనే తెలంగాణా ప్రజలు ఆ రెండు పార్టీలను తిరస్కరించారు. ఈసారి కూడా మళ్ళీ అదే జరుగబోతోందని గ్రహించిన కాంగ్రెస్‌-టిడిపిలు తమ శతృత్వం, సిద్దాంతాలు అన్నిటిని పక్కనపెట్టి చేతులు కలుపుతుంటే తెలంగాణా జనసమితి కూడా నిసిగ్గుగా వాటితో చేతులు కలుపుతోంది. అది మహా కూటమి కాదు మహా స్వాహా కూటమి. దానికి అధికారం కట్టబెడితే మళ్ళీ తెలంగాణా ఏర్పడక మునుపు ఉన్న పరిస్థితులే వస్తాయి. ఈన గాచి నక్కల పాలు చేయొద్దు అనుకొంటే టిఆర్ఎస్‌కే ఓటేసి మనల్ని మనమే పరిపాలించుకొందాము,” అని అన్నారు.


Related Post