రాజగోపాల్ రెడ్డిపై చర్యలు?

September 24, 2018


img

రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీల కూర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేసినందుకు కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షో-కాజ్ నోటీసు పంపించడం, దానిపై ఆయన మళ్ళీ స్పందిస్తూ టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా సీనియర్ కాంగ్రెస్‌ నేతలపై ఇంకా తీవ్రమైన విమర్శలు ఆరోపణలు చేయడం అందరూ చూశారు. రెండు రోజులలో సంజాయిషీ కోరగా ఆయన రెండు గంటలలోనే ప్రెస్ మీట్ పెట్టి అందరినీ దులిపేశారు. రెండు రోజుల గడువు కూడా ముగిసిపోయింది కనుక ఇప్పుడు బంతి కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ కోర్టులోనే ఉంది. 

ఒకవేళ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించినట్లయితే, కీలకమైన ఎన్నికల సమయంలో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ కంచుకోట బ్రద్దలయ్యే ప్రమాదం ఉంటుంది. ‘గాంధీభవన్ లో పదవులు, టికెట్లు అమ్ముకొంటున్నారని, పార్టీ నేతలు కళ్ళుమూసుకొని పనిచేస్తున్నారంటూ’ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తీవ్ర ఆరోపణలు చేసిన తరువాత కూడా ఆయనపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోయినా పార్టీ బలహీనతను చాటుకొన్నట్లవుతుంది. కనుక రాష్ట్ర కాంగ్రెస్‌ అధిష్టానానికి ఇది అగ్నిపరీక్షేనని చెప్పవచ్చు. 

మరో విశేషమేమిటంటే, కాంగ్రెస్ పార్టీలో ఇంత గొడవ జరుగుతున్నప్పటికీ ఇంతవరకు టిఆర్ఎస్‌ నేతలు ఎవరూ దీనిపై స్పందించలేదు. బహుశః వారు తదుపరి పరిణామాల కోసం తాపీగా ఎదురుచూస్తున్నారేమో? కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకొంటుందో లేదో చూసి తదనుగుణంగా స్పందించాలని ఎదురుచూస్తున్నారని భావించవలసి ఉంటుంది. నేడోరేపో కమిటీ సభ్యులు సమావేశమయ్యి రాజగోపాల్ రెడ్డి విషయంలో నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. 


Related Post