ఏపీలో మావోల దాడితో తెలంగాణా పోలీసులు అప్రమత్తం

September 24, 2018


img

నిన్న విశాఖజిల్లాలోని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపడంతో ఏపీతో పాటు తెలంగాణా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలవడంతో మంత్రులు, అధికార, ప్రతిపక్షపార్టీల ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారానికి వెళుతున్నందున వారందరికీ మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించడానికి అవసరమైన ఏర్పాట్ల గురించి డిజిపి మహేందర్ రెడ్డి పోలీస్ నిఘా ఉన్నతాధికారులతో సమావేశమయ్యి చర్చించారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు చాలా తగ్గిపోయినప్పటికీ, ఎన్నికలు ముగిసేవరకు అన్ని జిల్లాలలో మరింత అప్రమత్తంగా ఉండాలని డిజిపి మహేందర్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాలలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, చెన్నూర్, మంథని, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళే నేతలు అందరూ ముందుగానే పోలీసులకు తమ పర్యటన వివరాలను అందజేయాలని కోరారు. ముందుగా తెలియజేసినట్లయితే వారికి కట్టుదిట్టమైన భద్రత కల్పించగలమని తెలిపారు. 

రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఏపీలో ప్రజాప్రతినిధులను మావోయిస్టులు హత్య చేయడాన్ని నేను ఖండిస్తున్నాను. అది పిరికిపంద చర్యగా భావిస్తున్నాను. తెలంగాణాలో మావోయిస్టుల ప్రభావం బాగా తగ్గినప్పటికీ ఏపీలో జరిగిన మావోల దాడి నేపధ్యంలో తెలంగాణా రాష్ట్రంలో కూడా పోలీసులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాను. డిజిపి మహేందర్ రెడ్డి స్వయంగా తరచూ ప్రతీ జిల్లాలో పర్యటిస్తూ, జిల్లా పోలీస్ అధికారులతో శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నందున రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. నిన్న హైదరాబాద్‌లో జరిగిన వినాయక నిమజ్జనానికి లక్షల మంది తరలివచ్చినా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరుగకుండా చాలా ప్రశాంతంగా కార్యక్రమం పూర్తవడమే పోలీసుల సమర్ధకు చక్కటి నిదర్శనం," అని అన్నారు.


Related Post