కెసిఆర్‌ అంతా తప్పుడు నిర్ణయం ఎలా తీసుకొన్నారో? కోదండరామ్

September 21, 2018


img

సిఎం కెసిఆర్‌ అనేక సర్వేలు చేయించుకొని టిఆర్ఎస్‌ అనుకూలత, ప్రతికూలతలను తెలుసుకొని, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను, పార్టీల బలాబలాలను అన్నిటినీ పరిగణనలోకి తీసుకొన్నాకనే 9 నెలలు ముందుగా శాసనసభను రద్ధు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్దపడిన సంగతి అందరికీ తెలుసు. అయితే ఓటమి భయంతోనే సిఎం కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఓటమి భయమే ఉంటే మరో 9 నెలలు అధికారంలో కొనసాగుతాము గానీ అంతా సవ్యంగా ఉన్నప్పుడూ అధికారం ఎందుకు వదులుకొంటాము? అని టిఆర్ఎస్‌ నేతల ప్రశ్నిస్తున్నారు. 

తెలంగాణా జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ ఒక ప్రముఖ తెలుగు మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతూ, “సిఎం కెసిఆర్‌ గొప్ప రాజకీయ మేధావి అని అంటారు. కానీ ఇంత తెలివి తక్కువగా తొమ్మిది నెలలు ముందుగా తన ప్రభుత్వాన్ని తానే కూల్చుకొని ముందస్తు ఎన్నికలకు వెళుతుండటం విస్మయం కలిగిస్తోంది. ఇది ఖచ్చితంగా ఒక విఫల ప్రయోగంగా మారబోతోంది. సిఎం కెసిఆర్‌ స్వయంగా తాను మునుగుతూ టిఆర్ఎస్‌ను కూడా ముంచబోతున్నారు. ఎన్నికల తరువాత ఇది అందరూ చూడబోతున్నారు,” అని అన్నారు. 

తెలంగాణా జనసమితిలో కోదండరామ్ తప్ప ప్రజలు గుర్తించగల నాయకులు మరెవరూ లేనప్పుడు రాబోయే ఎన్నికలలో ఏవిదంగా గెలుస్తారనే ప్రశ్నకు సమాధానంగా, “మా పార్టీ పైకి ఆవిదంగా కనిపిస్తున్న మాట వాస్తవం. అయితే మా పార్టీ నేతలు, కార్యకర్తలు తమతమ నియోజకవర్గాలలో ప్రజల మద్యనే ఉంటున్నారు. వారు ఎవరో ప్రజలకు తెలుసు. ఇప్పటికే మేము 25 నియోజకవర్గాలలో బలపడ్డాము. ఎన్నికలలోపు మరో 25 నియోజకవర్గాలలో బలపడే అవకాశం ఉంది. పార్టీ పెట్టిన 5-6 నెలలలోనే ఈ స్థాయికి చేరుకోగలిగాము అంటే సమిష్టి కృషి వలననే సాధ్యం అయ్యింది. టిఆర్ఎస్‌లాగ మాపార్టీ ఒకే వ్యక్తిపై ఆధారపడి నడుస్తున్న పార్టీ కాదు. అందుకే మిత్రపక్షాలతో పొత్తులు, సీట్ల సర్ధుబాట్లపై చర్చించేందుకు మా పార్టీలో ముఖ్యనేతలు వెళుతున్నారు. టిఆర్ఎస్‌ గడీల దర్వాజాలు ప్రజలకు మూసుకుపోయాయి. టిఆర్ఎస్‌ నిరంకుశపాలనను అంతమొందించడానికే మేము రాజకీయాలలోకి రావలసి వచ్చింది. అందుకే ఉద్యమ ఆకాంక్షల మేరకు పనిచేసే పార్టీలతో పొత్తులకు సిద్దమయ్యాము. కానీ పొత్తుల వలన మా పార్టీకి ఎంతో కొంత లాభం కలగాలే తప్ప నష్టపోవాలని కోరుకోవడం లేదు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మా పార్టీని మేము కాపాడుకొంటూ ముందుకు సాగుతూనే ఉంటాము,” అని కోదండరామ్ చెప్పారు.


Related Post