కుంతియా శనిలా దాపురించాడు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

September 21, 2018


img

ఊహించినట్లుగానే కాంగ్రెస్‌ కమిటీలను ప్రకటించగానే పార్టీలో సీనియర్ నేతలు ఒకరొకరుగా తమ అసంతృప్తిని ఆగ్రహాన్ని వెళ్ళగక్కుతున్నారు. సీనియర్ కాంగ్రెస్‌ నేత వి.హనుమంత రావు మొదట అసంతృప్తి వ్యక్తం చేయగా, ఆయన తరువాత ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

“కుంతియా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పాలిట శనిలా దాపురించాడు. కాంగ్రెస్‌ కమిటీలలో బ్రోకర్లకు, పైరవీకార్లతో నింపేశారు. గత ఎన్నికలలో ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వలననే తెలంగాణా ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కనుక ప్రజల మద్య ఉండేవారికి పదవులు, టికెట్లు ఇస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాగలుగుతుంది తప్ప గాంధీ భవన్‌లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేవారికి ఇస్తే రాదు. ఇప్పటికైనా పైరవీకారులను పక్కనపెట్టి పార్టీలో క్షేత్రస్థాయిలో పనిచేసేవారికి ప్రాధాన్యత ఇవ్వాలని నేను కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కోరుతున్నాను,” అని అన్నారు. 

టి-పిసిసి అధ్యక్ష పదవి ఆశిస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్‌ కమిటీలలో కీలకపదవి లభిస్తుందని ఆశించడం సహజం. అలాగే ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కూడా ముఖ్యమైన పదవి లభిస్తుందని ఆశపడ్డారు. కానీ పార్టీలో చిరకాలంగా పనిచేస్తున్న సీనియర్ నేతలైన కోమటిరెడ్డి సోదరులను కాదని పార్టీలో కొత్తగా చేరిన రేవంత్ రెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి కీలక పదవి అప్పగించడమే రాజగోపాల్ రెడ్డి ఆగ్రహానికి కారణం అయ్యుండవచ్చు. గాంధీ భవన్‌లో కూర్చొని కబుర్లు చెప్పేవారంటే ఎవరో అందరికీ తెలుసు. కమిటీలలో బ్రోకర్లు, పైరవీకార్లతో నింపేశారని, కుంతియా కాంగ్రెస్ పార్టీకి పట్టిన శని అనే తీవ్ర వ్యాఖ్యలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంటియా ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. 


Related Post