ఇంతకంటే చంచల్ గూడా బెటర్: వి.హనుమంత రావు

September 20, 2018


img

రాజకీయలంటే పదవులు...అధికారం. కాంగ్రెస్ నేతలకు ఆ యావ మరికాస్త ఎక్కువ. గత ఎన్నికలలో ఇదే కారణంతో విజయాన్ని చేజార్చుకొన్నారు. మళ్ళీ ఈసారి కూడా అదే జరుగబోతోందా? అంటే సీనియర్ కాంగ్రెస్‌ నేత వి.హనుమంత రావు మాటలు వింటే అవుననే అనిపించకమానదు. 

కాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఆశించిన ఆయనకు ఆ పదవి లభించకపోవడంతో సిడబ్ల్యూసి సభ్యుడు గులాంనబీ ఆజాద్‌ ఎదుటే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ తరువాత బహిరంగంగా మీడియా ముందు కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. 

“నాకు ఎన్నికల ప్రచారకమిటీ బాధ్యతలు అప్పగిస్తారనే ఉద్దేశ్యంతో ఎన్నికల ప్రచారరధం కూడా సిద్దం చేయించుకొంటున్నాను. కానీ ఎన్నికల ప్రణాళిక, వ్యూహాల పని చూడమని చెపుతున్నారు. నేను ఇంట్లో కూర్చోనే మనిషిని కాను. ఎల్లప్పుడు ప్రజల మద్య ఉండేవ్యక్తిని. నాకు ప్రచార బాధ్యతలు అప్పగిస్తే నేను రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాను. 1989లో నాకు ప్రచార కమిటీ చైర్మన్‌ బాధ్యతలు అప్పగించినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకువచ్చాను. కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చోమంటున్నారు. అంతకంటే చంచల్ గూడా జైల్లో కూర్చోమంటే బాగుండేది. కాంగ్రెస్ పార్టీలో కొందరు కెసిఆర్‌ కోవర్టులున్నారు. నాకు పార్టీలో ప్రచారకమిటీ పదవి అప్పగిస్తే నేను టిఆర్ఎస్‌ను ఎక్కడ ఓడిస్తాననో భయంతో వారు నాకు పార్టీలో ముఖ్యమైన బాధ్యతలు అప్పగించకుండా అడ్డుపడుతున్నారు. వారు ఎప్పటికప్పుడు పార్టీ సమాచారాన్ని కెసిఆర్‌కు చేరవేస్తూ పార్టీని దెబ్బ తీస్తున్నారు. వారి పేర్లు ఇప్పుడు బయటపెట్టను కానీ రాహుల్ గాంధీకి వారి జాబితాను అందజేస్తాను,” అని అన్నారు.

వి.హనుమంత రావు నిస్సందేహంగా అపార అనుభవమున్న రాజకీయ నాయకుడే. కానీ ఇప్పటి మైండ్ గేమ్- రాజకీయాలకు ఆయన అనుభవం పెద్దగా ఉపయోగపడదని చెప్పక తప్పదు. ఆయన తన వయసును బట్టి క్రమంగా బాధ్యతల నుంచి తప్పుకొని యువతరానికి పార్టీ పగ్గాలు అందించి సలహాలకే పరిమితమయితే హుందాగా ఉంటుంది. కానీ హుందాగా రాజకీయాల నుంచి తప్పుకోవలసిన ఈ వయసులో పదవుల కోసం ఆరాటపడటం, టిఆర్ఎస్‌ జోరు చూస్తూ కూడా కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపిస్తానని ప్రగల్భాలు పలుకడం ద్వారా తాను నవ్వులపాలవడమే కాకుండా కీలకమైన ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బంది కలిగిస్తునానరు. 

కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించగలననే అంత నమ్మకమే ఆయనకు ఉన్నట్లయితే పార్టీ కోసం అద్భుతమైన ఎన్నికల వ్యూహాలు, ప్రణాళికలు రచించి చూపి తన సమర్ధతను చాటుకోవచ్చు. వి.హనుమంత రావు ఈరోజు మాట్లాడిన ఈ మాటల వలన కాంగ్రెస్ పార్టీని విమర్శించేందుకు టిఆర్ఎస్‌, బిజెపిలకు మంచి అవకాశం కల్పించినట్లయింది. 


Related Post