కొండా సురేఖ ఇంకా ఆశవదులుకోలేదా?

August 20, 2018


img

టిఆర్ఎస్‌ మొదటి జాబితాలో తన పేరు కనబడనందుకు సిఎం కెసిఆర్‌, మంత్రి కేటీఆర్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కొండా సురేఖ ఇంకా టిఆర్ఎస్‌ టికెట్ కోసం ఆశగా ఎదురుచూస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. గణేశ్ నవరాత్రులు ముగిసేవరకు కొండా దంపతులు తమ ఇంట్లో నుంచి బయటకు రాకపోయినా తమ అనుచరుల ద్వారా సిఎం కెసిఆర్‌పై ఒత్తిడి చేసి టికెట్ సాధించుకొనేందుకు ప్రయత్నిస్తుండటం విశేషం. 

వరంగల్ నగరంలోని ఆమె మహిళా అనుచరులు కొందరు స్టేషన్ రోడ్డులో గల మహేశ్వరి గార్డెన్ లో గురువారం చిన్నపాటి సభ నిర్వహించి, కొండా సురేఖకు టికెట్ ఇవ్వాలని టిఆర్ఎస్‌ అధిష్టానానికి విజ్నప్తి చేశారు. గత ఎన్నికలలో 53,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచిన కొండా సురేఖకు మళ్ళీ టికెట్ కేటాయించినట్లయితే ఈసారి లక్ష ఓట్లు మెజార్టీతో ఆమెను గెలిపించుకొంటామని చెప్పారు. అనంతరం ఆమెకు టికెట్ ఇవ్వాలని కోరుతూ వారు రాస్తారోకో నిర్వహించడంతో కొంతసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే లక్ష ఓట్లు మెజార్టీతో గెలుస్తాననే నమ్మకం వారికి, ఆమెకు ఉన్నప్పుడు మళ్ళీ టికెట్ కోసం సిఎం కెసిఆర్‌ను ప్రాధేయపడటం దేనికో అర్ధం కాదు. ఒకవేళ ఆమెకు నిజంగా లక్ష ఓట్లు మెజార్టీతో గెలిచే శక్తి ఉన్నట్లయితే టిఆర్ఎస్‌యే కాదు ఏ పార్టీ కూడా ఆమెను వదులుకోదు కదా? టిఆర్ఎస్‌కు పడే ఓట్లలో అధికశాతం సిఎం కెసిఆర్‌ మొహం చూసి పడేవే ఎక్కువని అందరికీ తెలుసు. కొండా దంపతులకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంచి బలమే ఉండి ఉండవచ్చు అయినా కూడా పార్టీ అండ కూడా తప్పనిసరి. అందుకేవారు టిఆర్ఎస్‌ టికెట్ కోసం ఇంకా ఎదురుచూపులు చూస్తున్నారని చెప్పవచ్చు. కానీ మొదటి జాబితాలో తన పేరు కనబడకపోయేసరికి కొండ దంపతులు తొందరపాటుతో నోరు జారాక ఇంకా టికెట్ లభిస్తుందని ఆశ పడటం హాస్యాస్పదంగా ఉంది. టికెట్ లభించలేదని బాధపడటం కంటే స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి తన సత్తా నిరూపించుకోవడం లేదా మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరుకొని అక్కడ టికెట్ కోసం ప్రయత్నించుకొంటే మంచిదేమో కదా!


Related Post