రాజయ్యను మార్చే ప్రసక్తి లేదట!

September 20, 2018


img

గత మూడేళ్ళుగా అయోమయ పరిస్థితిలో ఉన్న టిఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే టి.రాజయ్య పేరు మొదటి జాబితాలోనే కనబడటంతో ఆయన సంతోషానికి అవధులులేవు. కానీ అభ్యర్ధిగా ప్రకటించిన తరువాత ఒక మహిళతో ఫోన్లో చేసిన సరస సంభాషణ మీడియాకు పొక్కడంతో రాజయ్య కంగారు పడ్డారు. అదే అదునుగా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో టిఆర్ఎస్‌లో ఆయనను వ్యతిరేకించేవారందరూ కలిసి కడియం శ్రీహరికి ఆయనపై పిర్యాదులు చేసి తప్పనిసరిగా ఆయనను మార్చాలని పట్టుబట్టారు. వారి అభిప్రాయాలను సిఎం కెసిఆర్‌ దృష్టికి తీసుకువెళతానని కడియం శ్రీహరి చెప్పడంతో రాజయ్యలో అందోళన ఇంకా పెరిగిపోయింది. అడగకుండానే టికెట్ వచ్చిందన్న సంతోషమే లేకుండా పోయింది. పైగా నియోజకవర్గంలో స్వంతపార్టీ నేతలు, కార్యకర్తల నుండే తీవ్ర వ్యతిరేకతతో ఎదురవుతుండటంతో చేతికి వచ్చిన టికెట్ ఎక్కడ చేజారిపోతుందోనని రాజయ్య ఆందోళన చెందుతున్నారు. అభ్యర్ధుల మార్పు గురించి మీడియాలో కూడా ఊహాగానాలు వస్తుండటంతో అవి చూసి రాజయ్యకు కాంతి మీద కునుకు లేకుండా పోయింది.  

సరిగ్గా ఈ సమయంలో ధర్మాసాగర్ లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయనకు ఉపశమనం కలిగే ఒక చల్లటి మాట చెప్పారు. ఎట్టి పరిస్థితులలో రాజయ్యను మార్చే ప్రసక్తే లేదని, సిఎం కెసిఆర్‌ ఆదేశం మేరకే తాను ఇక్కడికి ఎన్నికల ప్రచారానికి వచ్చానని పల్లా చెప్పడంతో రాజయ్య కుదుటపడ్డారు. కడియం శ్రీహరి ఆశీసులు కూడా మీకే ఉన్నాయని పల్లా చెప్పడంతో రాజయ్య ఆనందానికి అవధులే లేవు. 

అన్ని అంశాలను పరిశీలించిన తరువాతే 105 మంది అభ్యర్ధుల పేర్లను ఖరారు చేశామని కనుక ఎట్టి పరిస్థితులలో వారిలో ఏ ఒక్కరినీ మార్చే ప్రసక్తి లేదని సిఎం కెసిఆర్‌ అభ్యర్ధులకు, పార్టీలో అందరికీ చెప్పినప్పటికీ ఇంకా అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి. అవి చూసి రాజయ్య వంటి అభ్యర్ధులు దిగులుపడుతూనే ఉన్నారు. కనుక నామినేషన్లు వేసే వరకు అభ్యర్ధులకు ఈ టెన్షన్ భరించకతప్పదేమో? 


Related Post