అప్పుడు మా వంతు...ఇప్పుడు కాంగ్రెస్‌ వంతు: బిజెపి

September 20, 2018


img

కాంగ్రెస్‌-టిడిపిల పొత్తుపై బిజెపి అధికార ప్రతినిధి జీవిఎల్ నర్సింహరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. డిల్లీలో తెలుగు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ టిడిపితో పొత్తు పెట్టుకోవడం ద్వారా తన బలహీనతను స్వయంగా చాటుకొంది. ఒంటరిగా పోటీ చేసి టిఆర్ఎస్‌ను డ్డీ కొనలేమనే భయంతోనే అది టిడిపితో పొత్తులు పెట్టుకొంది. తద్వారా రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు ఏకైక ప్రత్యామ్నాయ పార్టీ బిజెపి అని రుజువయింది. కాంగ్రెస్‌-టిడిపిల పొత్తుల వలన ఈసారి మాపార్టీకి చాలా మేలు కలుగబోతోంది. 

గత ఎన్నికలలో మేము టిడిపితో ఎన్నికల పొత్తులు పెట్టుకొన్నందునే మాకు తెలంగాణాలో తీవ్ర నష్టం జరిగింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ వంతు వచ్చింది. టిడిపితో పొత్తు పెట్టుకొన్న ఏ పార్టీ తెలంగాణాలో విజయం సాధించలేదు. కారణాలు అందరికీ తెలుసు. వాటికి పడవలసిన ఓట్లు వేరే పార్టీలకు పడటం ఖాయం కనుక ఆ మేరకు బిజెపికి లబ్ది కలుగుతుంది. ఇక టిఆర్ఎస్‌ కుటుంబపాలన, నిరంకుశత్వ, అప్రజాస్వామిక పాలన పట్ల రాష్ట్ర ప్రజలు విసుగెత్తిపోయున్నారు. కనుక ఈసారి ఎన్నికలలలో బిజెపికి చాలా సానుకూల వాతావరణం కనిపిస్తోంది. ఈసారి మేమే విజయం సాధించి తెలంగాణాలో అధికారంలోకి వస్తాము,” అని అన్నారు. 

ఈసారి ఎన్నికలలో ఎలాగైనా గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని తహతహలాడుతున్న కాంగ్రెస్ పార్టీ అందుకోసమే టిడిపితో పొత్తుపెట్టుకొంటోంది. కానీ టిడిపితో పొత్తు పెట్టుకొంటున్నందునే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని కెసిఆర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. టిడిపితో పొత్తుల విషయంలో వారి అంచనాలు నిజమవుతాయో లేక కాంగ్రెస్‌ అంచనాయే నిజమవుతుందో తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వెలువడేవరకు వేచిచూడక తప్పదు.


Related Post