కూకట్‌పల్లి నుంచి స్టార్ హీరో బరిలోకి?

September 20, 2018


img

ఈసారి ఎన్నికలలో టిఆర్ఎస్‌ను గట్టిగా డ్డీకొని ఓడించాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ తన బద్ధ శత్రువైన టిడిపితో చేతులు కలిపేందుకు సిద్దపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే నిన్నమొన్నటి వరకు ఒంటరిగానే పోటీ చేస్తామని చెపుతూ వచ్చిన తెలంగాణా జనసమితి కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తులకు సిద్దమైంది. కనుక ఆ రెండు పార్టీల తరపున ఇద్దరు కొత్త అభ్యర్ధుల పేర్లు తాజాగా తెరపైకి వచ్చాయి. టిడిపి తరపున దివంగత నటుడు హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్, తెలంగాణా జనసమితి తరపున దివంగత ముఖ్యమంత్రి చెన్నారెడ్డి మనుమడు ఆదిత్యరెడ్డి ఈసారి ఎన్నికలలో పోటీ చేయబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

హరికృష్ణ చనిపోయిన తరువాత ఆయన కుటుంబంలో ఒకరికి రాజకీయ అవకాశం కల్పించాలని టిడిపి భావిస్తునందున కళ్యాణ్ రామ్ ను కూకట్‌పల్లి లేదా శేరిలింగంపల్లి నియోజకవర్గాలలో ఏదో ఒక చోట నుంచి బరిలో దింపాలనుకొంటున్నట్లు అందుకు ఆయన కూడా సానుకూలంగానే ఉన్నారని మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఆదిత్యరెడ్డి కొన్ని రోజుల క్రితమే తెలంగాణా జనసమితిలో చేరారు. ఆయన తన తాత పోటీ చేసి గెలిచిన తాండూరు నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ మిత్రపక్షాల మద్య సీట్ల సర్ధుబాట్లపై చర్చలు కొలిక్కి వస్తే కళ్యాణ్ రామ్, ఆదిత్యరెడ్డిలు ఈ ఎన్నికలలో పోటీ చేస్తారా లేదా అనే విషయంపై స్పష్టత వస్తుంది. ఒకవేళ కళ్యాణ్ రామ్ పోటీ చేసినట్లయితే ఆయనకు మద్దతుగా ఆయన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం చేయడం తధ్యం కనుక ఈసారి ఎన్నికల ప్రచారం కూడా చాలా రసవత్తరంగా ఉండవచ్చు. 


Related Post