కాంగ్రెస్‌ నేతలకే సరిపోవు...ఇతర పార్టీలకు ఎలా?

September 20, 2018


img

టిఆర్ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌, టిడిపి, టిజెస్, సిపిఐ పార్టీలు మహాకూటమిగా కలిసి పోటీ చేయాలని నిశ్చయించుకొన్నాయి. బద్దవిరోధులైన కాంగ్రెస్‌-టిడిపిలు చేతులు కలపడం చూసి మొదట్లో అందరూ ఆశ్చర్యపోయినా ఇప్పుడు అందరూ దానిని జీర్ణించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. 

పొత్తుల తరువాత సీట్ల సర్ధుబాట్లు చాలా క్శ్లిష్టమైన ప్రక్రియ. దానిపై ఆ నాలుగు పార్టీల మద్య చర్చలు జరుగుతున్నాయీ కానీ అవి ఒక కొలిక్కి రావడానికి ఇంకా సమయం పట్టవచ్చు. ఈ నెలాఖరులోగా ఆ తంతు పూర్తిచేసి అక్టోబర్ మొదటివారంలో తమ అభ్యర్ధుల పేర్లను ప్రకటించాలని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీలోనే ఒక్కో సీటుకు కనీసం అరడజను మంది పోటీ పడుతున్నప్పుడు, వాటిలో కొన్ని సీట్లను మిత్రపక్షాలకు ఎలా ఇవ్వగలదోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీట్ల సర్ధుబాటు ప్రక్రియ పూర్తికాగానే అభ్యర్ధుల జాబితా ప్రకటించవలసి ఉంది కానీ అంతకంటే ముందు అలకపాన్పు, బుజ్జగింపు సీన్స్ వగైరాలు కూడా ఉంటాయి. పొత్తుల కోసం కాంగ్రెస్ పార్టీ కోల్పోబోయే సీట్లను ఆశిస్తున్నవారు పార్టీలో చాలా మందే ఉంటారు. వారీనందరినీ కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా బుజ్జగించి దారికి తెచ్చుకొంటుందో చూడాలి. 

శాసనసభను రద్దు చేసిన వెంటనే 105 స్థానాలకు టిఆర్ఎస్‌ అభ్యర్ధులను ప్రకటించిన సిఎం కెసిఆర్‌, ముఖ్యమైన 14 స్థానాలకు మాత్రం అభ్యర్ధులను ప్రకటించలేదు. కాంగ్రెస్‌ అభ్యర్ధులను ప్రకటించిన తరువాత ఆ పార్టీలో అసమ్మతివాదులలో బలమైన నేతలను టిఆర్ఎస్‌లోకి ఆకర్షించడం  కోసమే సిఎం కెసిఆర్‌ ఆ 14 సీట్లను అట్టేబెట్టారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం తప్పటడుగు వేసిన పార్టీలో ముఖ్యనేతలు టిఆర్ఎస్‌లో చేరో లేక స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసో కాంగ్రెస్‌ పార్టీనే సవాలు చేయవచ్చు. కనుక కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలతో సీట్లసర్ధుబాటు కత్తి మీద సామువంటిదేనని చెప్పవచ్చు.


Related Post