ముందస్తు సవాళ్ళు

September 19, 2018


img

ముందస్తు ఎన్నికలను వ్యతిరేకిస్తూ వరుసగా దాఖలవుతున్న పిటిషన్లను న్యాయస్థానాలు కొట్టి వేస్తున్నప్పటికీ మళ్ళీ కొత్త పిటిషన్లు దాఖలవుతూనే ఉండటం విశేషం. తాజాగా సిద్దిపేటకు చెందిన పి శశాంక్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ముందస్తు ఎన్నికలను వ్యతిరేకిస్తూ పిటిషన్ వేశారు. 

ముందస్తు ఎన్నికలను నిర్వహించడం వలన రాష్ట్రంలో ప్రజలపై అనవసరమైన ఆర్ధికభారం పడుతుందని, రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది తమ ఓటు హక్కును కోల్పోతారని ఇది రాజ్యాంగం వారికి ప్రసాదించిన ప్రాధమిక హక్కును భంగపరిచినట్లేనని కనుక ముందస్తు ఎన్నికలను నిలిపివేయాలని పిటిషనర్ కోరారు. అదీగాక తెలంగాణాలో ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని కనుక అత్యవసరంగా ఎన్నికలకు వెళ్లవలసిన అవసరంలేదని పిటిషనర్ పేర్కొన్నారు. 

ముఖ్యమంత్రి కెసిఆర్‌ తాను ఎన్నికల కమీషన్ అధికారులతో ముందుగానే మాట్లాడిన తరువాతే ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్లు చెప్పడాన్ని కూడా పిటిషనరు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్నికల కమీషన్ ప్రకటించవలసిన ఎన్నికల షెడ్యూల్ ను సిఎం కెసిఆర్‌ ప్రకటించడం, మళ్ళీ తానే ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించుకోవడాన్ని పిటిషనరు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. 

సిఎం కెసిఆర్‌ కేవలం తన రాజకీయ లబ్ధి కోసమే శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని దాని వలన రాష్ట్ర ప్రజలపై అధనపు ఆర్ధికభారం మోపుతున్నారని ఫిర్యాదు చేశారు. కనుక శాసనసభ ఎన్నికలను కూడా వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలతో కలిపి నిర్వహించాలని కోరారు.  తెలంగాణా శాసనసభ ఎలాగూ రద్దయింది కనుక ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని రద్దు చేసి గవర్నర్ పాలన విదించాలని పిటిషనరు కోరారు. అప్పుడే ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతాయని పిటిషనరు పేర్కొన్నారు. ఇప్పటి వరకు దాఖలైన పిటిషన్లు కొట్టివేస్తున్న న్యాయస్థానం తాజాగా దాఖలైన ఈ పిటిషనుపై ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. 


Related Post