టిఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖకు మొదటి జాబితాలో టికెట్ కేటాయించకపోవడంతో ఆగ్రహంతో పార్టీ అధిష్టానంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత గణేశ్ నవరాత్రి ఉత్సవాలు మొదలవడంతో కొండా దంపతులు తమ ఆనవాయితీ ప్రకారం ఇంటి గడప దాటి బయటకు రావడం లేదు. నవరాత్రులు ముగిసిన తరువాత వారు మళ్ళీ ప్రజల మద్యకు వచ్చి తమ నిర్ణయం ప్రకటిస్తారు. ఒకవేళ టిఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే కొండా సురేఖ పరకాల నుంచి, ఆమె కుమార్తె వరంగల్ తూర్పు నియోజకవర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేయవచ్చునని తెలుస్తోంది.
కొండా దంపతులు టిఆర్ఎస్ అధిష్టానంపై తిరుగుబాటు చేసి వారం రోజులు అవుతున్నప్పటికీ ఇంతవరకు టిఆర్ఎస్ వారిపై ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో ఆమెకు టికెట్ ఈయడం ఖాయమని మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి. అయితే మంత్రి కేటీఆర్ మంగళవారం తన నివాసంలో వరంగల్, కరీంనగర్ జిల్లాల నేతలతో సమావేశమైనప్పుడు కొండా సురేఖ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు, “పార్టీ క్రమశిక్షణను అతిక్రమించినవారి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు,” అని చెప్పినట్లు తెలుస్తోంది. అంటే ఆమెకు టికెట్ ఇవ్వడంలేదని స్పష్టమవుతోంది. కనుక కొండా సురేఖ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తారో లేక కాంగ్రెస్ పార్టీలో చేరుతారో చూడాలి. టికెట్ విషయంలో ఆమె ఆగ్రహం చెందడం సహజమే కానీ ఆ కారణంగా తొందరపడి సిఎం కెసిఆర్, కేటీఆర్‌లపై విమర్శలు గుప్పించడమే ఆమె చేసిన పెద్ద తప్పు. కొండా దంపతులు దానికి మూల్యం చెల్లించుకోవలసి వస్తోందిప్పుడు.