తెలంగాణాలో ఎన్నికలు.. ఏపీలో బహిరంగసభా?

September 19, 2018


img

టిఆర్ఎస్‌ అభ్యర్ధులు అందరూ అప్పుడే తమతమ నియోజకవర్గాలలో జోరుగా ఎన్నికల ప్రచారం చేసుకొంటున్నారు. ఈ నేపద్యంలో తెలంగాణాలో కాంగ్రెస్‌ శ్రేణులను ఉత్సాహపరచడానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారసభ నిర్వహించి ఉండాలి కానీ ఏపీలో కర్నూలులో నిన్న సభ నిర్వహించడం విశేషం. త్వరలో ఎన్నికలు జరుగబోతున్న తెలంగాణా రాష్ట్రంలో కాక మరో 8-9 నెలల తరువాత ఎన్నికలు జరుగబోయే ఏపీలో రాహుల్ గాంధీ బహిరంగసభ ఎందుకు నిర్వహించారు? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కనుక మళ్ళీ ఏపీలో కాంగ్రెస్ పార్టీలో జీవం నింపాలనుకోవడం సహజమే. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి తప్పకుండా ప్రత్యేకహోదా ఇస్తామని రాహుల్ గాంధీ ఆ సభలో ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే అది ఏపీ ప్రజల కోసం కాక టిడిపికి దగ్గరయ్యేందుకేనని చెప్పవచ్చు.  తెలంగాణాలో టిడిపితో ఎలాగూ దోస్తీ కుదిరింది కనుక ఏపీలో కూడా టిడిపితో దోస్తీ చేసి వచ్చే ఎన్నికలలో ఏపిలో కొన్ని సీట్లయినా సంపాదించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆశపడటం తప్పు కాదు. ఆ ప్రయత్నంలోనే కాంగ్రెస్‌ పార్టీకి కాస్త పట్టున్న కర్నూలులో రాహుల్ గాంధీ సభ నిర్వహించి, బాబు సర్కారుకు ‘ప్రత్యేకహోదా తాయిలం’ ఆఫర్ చేసినట్లున్నారు. ఆ సభలో నరేంద్ర మోడీపై తీవ్ర ఆరోపణలు గుప్పించిన రాహుల్ గాంధీ టిడిపి ప్రభుత్వం, సిఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావన చేయకపోవడం అదే సూచిస్తోంది. 

అయితే ఈ సభను చంద్రబాబు నాయుడే స్వయంగా ఏర్పాటు చేయించి ఉన్నా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, ఆయన ప్రస్తుతం ఇద్దరు అత్యంత బలమైన శత్రువులను ఏకకాలంలో ఎదుర్కోవలసి వస్తోంది. 1. ప్రధాని నరేంద్ర మోడీ. 2. జగన్మోహన్ రెడ్డి. వారిద్దరినీ ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ అండదండలు చాలా అవసరమని భావించిన చంద్రబాబు నాయుడు, తెలంగాణాలో ఆ పార్టీతో పొత్తులకు సై అన్నారు. కానీ ఏపిలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపాలంటే ప్రజలకు చాలా బలమైన కారణం చూపాల్సి ఉంటుంది. నిన్న కర్నూలులో జరిగిన సభలో రాహుల్ గాంధీ ఆ బలమైన కారణం చూపారు. అదే ఏపీకి ప్రత్యేకహోదా. 

కనుక ఇక నుంచి టిడిపి నేతలు మీడియా ముందుకు వచ్చి ఏపీకి ప్రత్యేకహోదా సాధించేందుకు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం చాలా అవసరం అంటూ వాదించడం మొదలుపెట్టి, రాష్ట్రంలో కాంగ్రెస్‌-టిడిపి పొత్తులకు అనుకూలమైన వాతావరణం సృష్టించే ప్రయత్నాలు చేయవచ్చు. ఈ ఊహ నిజమో కాదో త్వరలోనే తెలుస్తుంది. లేకుంటే రాహుల్ గాంధీ ఇంత ఆకస్మికంగా ఏపిలో బహిరంగసభ నిర్వహించడానికి కారణమే కనబడటం లేదు.


Related Post