మిర్యాలగూడలో ప్రణయ్ కుమార్ హత్య కేసులో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కరీం హస్తం ఉందనే అనుమానంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకోగానే, ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. కానీ ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావుపై టిఆర్ఎస్ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎమ్మార్పీయెస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మారుతీరావును ఇటీవలే మంత్రి కేటీఆర్ సమక్షంలో టిఆర్ఎస్‌లో చేర్చుకొన్నారని, అధికార పార్టీ అందండలున్నందునే అతను ఇంత ఘాతుకానికి ఒడిగట్టాడని మందకృష్ణ ఆరోపించారు. మారుతీరావును తక్షణం టిఆర్ఎస్‌లో నుంచి బహిష్కరించి, అతనిని బయటకు రానివ్వకుండా జైలులోనే ఉంచి చట్టప్రకారం కటినశిక్షపడేలా చూడాలని మందకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై నిరసన తెలియజేస్తూ మందకృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మార్పీయెస్ కార్యకర్తలు, దళిత ప్రజా సంఘాలు మంగళవారం మిర్యాలగూడ పట్టణంలో నెహ్రూ పార్క్ నుంచి చౌరస్తా వరకు నల్ల జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కులం పిచ్చితో స్వంత అల్లుడినే అతికిరాతకంగా హత్య చేయించిన మారుతీరావును టిఆర్ఎస్ ఉపేక్షిస్తే సహించబొమని మందకృష్ణ హెచ్చరించారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ నిరసనలు కొనసాగిస్తామని మందకృష్ణ హెచ్చరించారు.
టిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో పడినందున మారుతీరావును పార్టీ నుంచి బహిష్కరించడంలో ఆలస్యం జరుగుతున్నట్లుంది. ఇంకా ఆలస్యం చేస్తే టిఆర్ఎస్‌పై ప్రజలలో అనుమానాలు, అపోహలు పెరిగే ప్రమాదం ఉంది. అలాగే ఇటువంటి నిరసనలు వెల్లువెత్తవచ్చు. ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ పరిణామాలు టిఆర్ఎస్‌కు చాలా నష్టం కలిగించేవే కనుక మారుతీరావుపై తక్షణం చర్యలు తీసుకొంటే మంచిది.