దేశంలో ఎక్కడో అక్కడ ఏదో ఒక కారణంతో ఎవరో ఒక కాంగ్రెస్ నేత కోర్టులో పిటిషన్ వేయని రోజు ఉండదంటే అతిశయోక్తి కాదు. అందుకే కాంగ్రెస్ నేతలకు కోర్టు పక్షులనే పేరు కూడా ఉంది. ఈ ఏడాది చివరిలోగా మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, తెలంగాణా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు నిర్వహించవలసి ఉంది కనుక ఆ రాష్ట్రాలలో ఎన్నికల కమీషన్ ఓటర్ల జాబితాలను సిద్దం చేస్తోంది.
అయితే అధికార పార్టీ నుంచి వస్తున్న రాజకీయ ఒత్తిళ్ళు కారణంగా హడావుడిగా ఓటర్ల జాబితాలను తయారుచేస్తున్నందున, అర్హులైన లక్షలమంది ఓటు హక్కు కోల్పోతున్నారని, అనేక లక్షల నకిలీ ఓటర్లు నమోదు అవుతున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో కేసు వేసింది. శాసనసభ ఎన్నికలు పారదర్శకంగా, జవాబుదారీతనంతో జరిగేలా చూడాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాధ్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు.
దానిపై ఎన్నికల కమీషన్ దాఖలు చేసిన కౌంటర్ పిటిషనులో, కాంగ్రెస్ నేతలు తమ రోజువారీ కార్యక్రమాలలో చాలా అతిగా జోక్యం చేసుకొంటున్నారని, దాని వలన తాము స్వేచ్ఛగా పనిచేసుకోవడం కష్టం అవుతోందని వారిని ఎన్నికల కమీషన్ వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా నిరోధించాలని కోరింది. అనేక దశాబ్ధాలుగా దేశంలో సజావుగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని కనుక తాము ఎప్పుడు ఏవిధంగా పని చేయాలో కాంగ్రెస్ నేతలు తమకు చెప్పనవసరం లేదని, కనుక వారిని తమకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమీషన్ సుప్రీంకోర్టును కోరింది.
ఎన్నికల కమీషన్ ఈవిధంగా సుప్రీంకోర్టును కోరడం విచిత్రంగానే ఉంది. ఎన్నికల కమీషన్ ప్రజాస్వామ్య విలువలను కాపాడేవిధంగా పూర్తి పారదర్శకంగా, రాజ్యాంగబద్దంగా వ్యవహరిస్తున్నట్లయితే ఈవిధంగా ఎవరూ దానిని వేలెత్తి చూపలేరు. కానీ స్వతంత్ర సంస్థ అయిన అది రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వాటికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకొంటునందునే కాంగ్రెస్ నేతలు దానిపై కోర్టుకు వెళ్ళగలుగుతున్నారు.
ఉదాహరణకు తెలంగాణా రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను జనవరి మొదటివారంలోగా ఖరారు చేయాలనుకొన్న ఎన్నికల కమీషన్, తెలంగాణా శాసనసభ రద్ధు కాగానే ఆ గడువును అక్టోబర్ 8వ తేదీకి కుదించివేసింది. ఎందుకంటే సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం శాసనసభ రద్దు అయిన తరువాత వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని వాదిస్తోంది.
కానీ రాజ్యాంగం ప్రకారం శాసనసభ రద్దయిన 6 నెలలోగా ఎన్నికలు నిర్వహించవచ్చు. అంటే తెలంగాణా శాసనసభకు వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలతో కలిపి నిర్వహించవచ్చు. కానీ డిసెంబరులోపే ఎన్నికల నిర్వహణకు సిద్దపడింది. అందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కారణమా లేక రాజకీయ ఒత్తిళ్ళు కారణమా అనేది ఎన్నికల కమీషనే చెప్పాలి.