త్వరలో డి.శ్రీనివాస్ టిఆర్ఎస్‌కు గుడ్ బై?

September 18, 2018


img

టిఆర్ఎస్‌ ఎంపీ డి.శ్రీనివాస్ ఈ నెల 27వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా టిఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేయబోతున్నారని తాజా సమాచారం. ఎందుకంటే, ఆయనపై నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్‌ నేతలు ఫిర్యాదు చేసిన తరువాత ఆయన సిఎం కెసిఆర్‌ను కలిసి వివరణ ఇచ్చుకోవాలనుకొన్నారు. కానీ ఇంతవరకు సిఎం కెసిఆర్‌ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. పైగా టిఆర్ఎస్‌ అభ్యర్ధుల జాబితాను ప్రకటించినప్పుడు డి.శ్రీనివాస్ గురించి ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, “ఆయన కావాలనుకొంటే పార్టీలో ఉండొచ్చు లేకుంటే పోవచ్చు” అని సిఎం కెసిఆర్‌ సమాధానం చెప్పారు. అంటే సిఎం కెసిఆర్‌ కూడా బంతిని డి.శ్రీనివాస్ కోర్టులో పడేశారన్న మాట. 

టిఆర్ఎస్‌లో ఆదరణలేకపోగా వ్యతిరేకత నెలకొని ఉన్నందున ఇక ఆ పార్టీలో కొనసాగి ప్రయోజనం లేదని భావిస్తున్న డి.శ్రీనివాస్ సోమవారం మధ్యాహ్నం జిల్లాలోని తన అనుచరులతో సమావేశమయ్యి తన నిర్ణయం చెప్పారు. వారు కూడా ఆయన పార్టీ వీడటమే మంచిదని చెప్పడంతో, ఈ నెల 27న తన పుట్టినరోజున టిఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేయాలని డి.శ్రీనివాస్ నిర్ణయించుకొన్నారు. ఆరోజున జిల్లా వ్యాప్తంగా ఆయన అనుచరులు డిఎస్ పుట్టినరోజులు వేడుకలు ఘనంగా జరిపి, ఆదేరోజున టిఆర్ఎస్‌ను వీడుతున్నట్లు ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఆయన మళ్ళీ కాంగ్రెస్‌ గూటికి చేరుకొనేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. 


Related Post