ఉద్యమ సమయంలో ఉత్తమ్ ఎక్కడున్నారు?

September 18, 2018


img

టిఆర్ఎస్‌తో సహా రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు సోమవారం (సెప్టెంబర్ 17) తమ పార్టీ కార్యాలయాలలో జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణా విమోచన దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకొన్నాయి. రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తెలంగాణా ఉద్యమసమయంలో ఎక్కడా కనబడని ఉత్తమ్ కుమార్ రెడ్డికి,  తెలంగాణా ప్రయోజనాల కంటే తన పదవే ముఖ్యమనుకొన్న కిషన్ రెడ్డికి తెలంగాణా విమోచన దినోత్సవం గురించి మాట్లాడే నైతికహక్కు లేదు.

రాష్ట్ర బిజెపి నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మైనార్టీల సంక్షేమం, రిజర్వేషన్ల గురించి మన ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మైనార్టీల కోసం మా ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ పధకాల సంగతి ఆయనకు తెలియదనే అర్ధమవుతోంది. మైనార్టీల పిల్లల కోసం మా ప్రభుత్వం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసింది. షాదీ ముబారక్ పేరుతో ముస్లిం ఆడపిల్లల వివాహానికి ఆర్ధిక సాయం అందిస్తోంది. రాష్ట్రంలో అన్ని కులాలు, మతాల ప్రజలను సమానంగా చూస్తున్న ప్రభుత్వం మాది. మా పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏమి కావాలి?

కాంగ్రెస్‌ నేతలకు ఎంతసేపు అధికారంలోకి రావాలనే ఆలోచనే తప్ప రాష్ట్రాభివృద్ధి, ప్రజల సమస్యలు పట్టవు. అందుకే రాష్ట్రాభివృద్ధికి అవరోధాలు సృష్టిస్తున్న టిడిపితో ఎన్నికల పొత్తులు పెట్టుకోవడానికి సిద్దపడుతున్నారు. అయితే కాంగ్రెస్‌-టిడిపితో పొత్తులు పెట్టుకొంటే తెలంగాణా ప్రజలు ఆమోదించబోరు. చంద్రబాబు నాయుడు నేటికీ తెలంగాణా రాష్ట్ర వ్యవహారాలలో వేలు పెట్టడం మానుకోలేదు. ఆయనకు తెలంగాణా రాష్ట్రంలో ఏం పని?” అని ప్రశ్నించారు. 

తెలంగాణా ఉద్యమాలలో పాల్గొననివారు, ఉద్యమాలను వ్యతిరేకించినవారు టిఆర్ఎస్‌ పార్టీలో, ప్రభుత్వంలో ఇప్పుడు చాలామందే ఉన్నారనే సంగతి అందరికీ తెలుసు. ఇతర పార్టీల నుంచి వచ్చిన అటువంటివారికి సిఎం కెసిఆర్‌ పదవులు, అధికారం కట్టబెట్టి ప్రాధాన్యతనిస్తుండటం టిఆర్ఎస్‌లో ఉద్యమకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం, ఆయూబ్ ఖాన్ (తాండూర్) వంటి ఆవేశపరులు మంత్రి మహేందర్ రెడ్డి ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకోవడం అందరికీ తెలుసు.

ఒక పక్క కాంగ్రెస్‌ పార్టీని, దాని నేతలను నిందిస్తూనే డి.శ్రీనివాస్, దానం నాగేందర్, సురేశ్ రెడ్డి వంటి కాంగ్రెస్‌ నేతలను టిఆర్ఎస్‌లో చేర్చుకొంటూనే ఉన్నారు. అందుకు టిఆర్ఎస్‌ను తప్పు పట్టలేము. ఎందుకంటే తెలంగాణా ఏర్పడిన తరువాత టిఆర్ఎస్‌ ఒక రాజకీయపార్టీగా మారిందని సిఎం కెసిఆర్‌ స్వయంగా చెప్పారు. కనుక ఎన్నికలను తెలంగాణా ఉద్యమాలతో ముడి పెట్టి చూడనవసరం లేదిప్పుడు. చూడదలిస్తే టిఆర్ఎస్‌లో వారిని కూడా చూడవలసి వస్తుంది. 


Related Post