తెలంగాణా బాహుబలి ఎవరో తెలుసా?

September 17, 2018


img

బాహుబలి అనగానే ఆరడుగుల ఎత్తు, కండలు తిరిగిన ఉక్కు లాంటి శరీరంతో ప్రభాస్ కనబడతాడు. కానీ బాహుబలి అనే పదాన్ని ‘ఛాంపియన్’ అనే విధంగా అందరూ వాడేసుకొంటున్నారు. ప్రధాని మోడీ మొదలు జానారెడ్డి వరకు రాజకీయనేతలు కూడా బాహుబలిని వాడేసుకొంటున్నారు. కనుక ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా బాహుబలిని వాడుకొనే ప్రయత్నం చేశారు. అయితే ఆయన చెప్పిన వ్యక్తికి బాహుబలి వంటి శరీరం లేదు కానీ రాష్ట్ర రాజకీయాలలో మాత్రం ఆయన నిజంగా బాహుబలే. ఆయన మరెవరో కాదు సిఎం కెసిఆర్‌.   

ఆదివారం జయశంకర్ భూపాలపల్లిలోని రేగొండలో టిఆర్ఎస్‌ కార్యకర్తలతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమావేశం అయినప్పుడు ఆయన వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాష్ట్ర రాజకీయాలలో ఒకే ఒక బాహుబలి ఉన్నారు. ఆయనే సిఎం కెసిఆర్‌. ఆ బాహుబలి ధాటికి తట్టుకోలేకనే కాంగ్రెస్‌ పార్టీ టిడిపితో పొత్తులకు సిద్దపడింది. అధికారం కోసం వారు అనైతిక పొత్తులు పెట్టుకొన్నప్పటికీ బాహుబలి చేతిలో ఓటమి తప్పదు. ఇక రాష్ట్రంలో దళితులు వివక్షకు గురవుతున్నారని అమిత్ షా మొసలి కన్నీళ్లు కార్చారు. కానీ బిజెపి పాలిత రాష్ట్రాలలోనే మైనార్టీలు, దళితులపై ఎక్కువగా దాడులు జరుగుతుండటం దేశప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. కనుక ప్రతిపక్షాల మాయమాటలను, అవి చేస్తున్న నిరాధారమైన ఆరోపణలను, విమర్శలను నమ్మవద్దని అందరికీ విజ్నప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తేనే యధాతధంగా అభివృద్ధి కొనసాగుతుంది. లేకుంటే నాలుగేళ్ళ ఈ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కనుక టిఆర్ఎస్‌ విజయానికి ప్రతీ కార్యకర్త గట్టిగా కృషి చేయాలి,” అని అన్నారు.


Related Post