ముందస్తుకు ఎందుకు వెళుతున్నారంటే....రేవంత్ రెడ్డి

September 17, 2018


img

ఆదివారం వనపర్తి జిల్లాలో ‘పెబ్బేరు పొలికేక...ప్రజాగ్రహసభ” పేరిట కాంగ్రెస్‌ పార్టీ బహిరంగసభ నిర్వహించింది. ఆ సభకు రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సిఎం కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి ఉన్న కారణాన్ని ఆయన ప్రజలకు వివరించారు. 

“టిఆర్ఎస్‌-బిజెపి మద్య కుదిరిన ఒక రహస్య అవగాహన మేరకే సిఎం కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్‌, లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి లబ్ది కలిగేలా వారిరువురి ఒప్పందం చేసుకొన్నారు. నిజానికి టిఆర్ఎస్‌ ఇతరపార్టీలతో పొత్తులు లేకుండా ఏనాడూ ఎన్నికలలో పోటీ చేయలేదు. 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొంటే, 2009లో టిడిపితో పెట్టుకొంది. ఇప్పుడు బిజెపితో రహస్యంగా, మజ్లీస్ పార్టీతో బహిరంగంగా అవగాహన కుదుర్చుకొని ముందుకు సాగుతున్నారు,” అని రేవంత్ రెడ్డి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన సిఎం కెసిఆర్‌ పై ఇంకా చాలా విమర్శలు చేశారు. అయితే అవన్నీ మన చర్చకు అనవసరం. 

బిజెపి-టిఆర్ఎస్‌ల మద్య అవగాహనకు రేవంత్ రెడ్డి చెపుతున్న కారణం సహేతుకంగానే కనిపిస్తోంది. ఏవిధంగా అంటే, టిఆర్ఎస్‌కు రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో మోడీ సర్కారుకు కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రావడం అంతే ముఖ్యం. టిఆర్ఎస్‌ వీలైనన్ని ఎక్కువ అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనుకొంటున్న సంగతి రహస్యమేమీ కాదు.  

ఇక మోడీ సర్కార్ విషయానికి వస్తే, రాబోయే లోక్‌సభ ఎన్నికలలో దానికి కాంగ్రెస్ పార్టీ చాలా గట్టి పోటీనీయబోతోంది. ఎందుకంటే ఆ ఎన్నికలపైనే రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.  కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు, బిజెపికి కొత్తగా ఏర్పడిన చంద్రబాబు నాయుడు వంటి శత్రువుల కారణంగా వచ్చే ఎన్నికలలో బిజెపికి లోక్‌సభ స్థానాలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. కనుక ప్రతీ ఒక్క లోక్‌సభ సీటు బిజెపికి చాలా అమూల్యమైనదే. కనుక తెలంగాణా రాష్ట్రంలో కూడా వీలైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాలను గెలుచుకోగలిగితే అవి కేంద్రంలో మళ్ళీ మోడీ సర్కార్ ఏర్పాటుకు చాలా ఉపయోగపడతాయి. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మొదటి నుంచి తెలంగాణాలో లోక్‌సభ సీట్లపైనే ఎక్కువ దృష్టి పెట్టడం గమనిస్తే రేవంత్ రెడ్డి చెప్పినది నిజమేనని భావించవలసి వస్తుంది. 

అయినా తెలంగాణాలో బిజెపి టిఆర్ఎస్‌ను ఎదుర్కొని ఓడించగలిగే స్థితిలో లేదు కనుక బిజెపి అధిష్టానం టిఆర్ఎస్‌తో రహస్య అవగాహన కుదుర్చుకొని ఉంటే ఆశ్చర్యం లేదు. ఈవిధంగా బిజెపి-టిఆర్ఎస్‌లు పరస్పర ప్రయోజనాలను కాపాడుకోవడం సాధ్యం అవుతున్నప్పుడు అవి మాత్రం ఎందుకు కాదనుకొంటాయి?  

టిఆర్ఎస్‌ విజయానికి దోహదపడేవిధంగా ముందస్తు ఎన్నికలకు కేంద్రం సహకరిస్తున్నందున, టిఆర్ఎస్‌ కూడా లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి సహకరించవచ్చు.


Related Post