ముందస్తును సమర్ధించుకోవడానికి కారణమే లేదా?

September 17, 2018


img

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మొన్న హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా జమిలి ఎన్నికలకు సై అన్న సిఎం కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళుతున్నారో చెప్పాలని నిలదీశారు. ఆయన ప్రశ్నకు మంత్రి కేటీఆర్‌ సమాధానం చెప్పారు. “అమిత్ షాకు మతిమరుపు వచ్చినట్లుంది. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2002లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన సంగతి అమిత్ షాకు గుర్తులేదా? అలాగే 2004లో అటల్ బిహారీ వాజ్ పేయి ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన సంగతి అమిత్ షా మరిచిపోయారా? వారి పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు తప్పు కానప్పుడు మేము వెళుతుంటే ఎందుకు తప్పు పడుతున్నారు?” అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. 

అయితే ఒకప్పుడు బిజెపి ముందస్తు ఎన్నికలకు వెళ్లింది కనుక టిఆర్ఎస్‌ వెళ్ళడం తప్పు కాదని వాదించడం ఈ ప్రశ్నకు సమాధానం కాదని అందరికీ తెలుసు. రాష్ట్ర ప్రగతి నిలిచిపోకూడదనే కారణంతోనే ముందస్తు ఎన్నికలకు వెళుతున్నామని టిఆర్ఎస్‌ నేతలు ఒక విచిత్రమైన కారణం చెపుతున్నారు. కానీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా టిఆర్ఎస్‌ 100 సీట్లు గెలుచుకోవడం ఖాయం అని, తమ పాలన పట్ల రాష్ట్ర ప్రజలు అందరూ చాలా సంతృప్తిగా సంతోషంగా ఉన్నారని సిఎం కెసిఆర్‌తో సహా టిఆర్ఎస్‌ మంత్రులు అందరూ చెప్పుకొంటున్నప్పుడు, మిగిలిన 9 నెలలు కూడా పాలించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించి ప్రజల ముందుకు వెళ్ళినట్లయితే మొత్తం 119 సీట్లు టిఆర్ఎస్‌కే దక్కేవేమో కదా? అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ కానీ 9 నెలలు ముందుగా ఎందుకు అధికారం వదులుకొని దిగిపోయారు? అనే ప్రశ్నకు టిఆర్ఎస్‌ సంతృప్తికరమైనా సమాధానం చెప్పలేకపోతోంది కనుక ప్రతిపక్షాలే సమాధానం చెప్పుతున్నాయి. 

ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళుతోందని ప్రతిపక్ష నేతలు వాదిస్తున్నారు. వారి ఆ వాదనను మాత్రం టిఆర్ఎస్‌ నేతలు చాలా చక్కగా త్రిప్పి కొడుతున్నారు కానీ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళుతున్నారనే ప్రశ్నకు మాత్రం సంతృప్తికరమైనా సమాధానం చెప్పలేకపోతున్నారు. కాంగ్రెస్‌, బిజెపిలతో ప్రతిపక్ష పార్టీలన్నీ దీనిని తమ ఎన్నికల ప్రచారంలో వాడుకోకుండా వదిలిపెట్టరు. ఐదేళ్లు పాలించమని అధికారం ఇస్తే 9 నెలలు ముందుగానే దిగిపోయిన పార్టీకి మళ్ళీ ఓట్లేసి ఎందుకు గెలిపించాలని ప్రతిపక్షాలు ప్రశ్నించకమానవు. కనుక టిఆర్ఎస్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం రాజకీయంగా గొప్ప వ్యూహమే కావచ్చు కానీ ప్రతిపక్షాల ఈ ప్రశ్నకు సంతృప్తికరమైన జవాబు చెప్పలేకపోవడం వలన టిఆర్ఎస్‌కు రాజకీయంగా ఎంతో కొంత నష్టం కూడా తప్పకపోవచ్చు. 


Related Post