నేను సిఎం రేసులో ఉన్నాను: జైపాల్ రెడ్డి

September 17, 2018


img

మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఈసారి మహబూబ్‌నగర్‌ నుంచి శాసనసభకు పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకొంటున్నట్లు తాజా సమాచారం. ఆయన ఆ నియోజకవర్గంలో ముఖ్య కాంగ్రెస్‌ నాయకులకు ఫోన్లు చేసి, తాను ఈసారి శాసనసభకు పోటీ చేయాలనుకొంటున్నానని, కనుక తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు తాజా సమాచారం. నాకు మీరు ఇప్పుడు మద్దతు ఇస్తే సిఎం అయిన తరువాత నేను మీ అందరినీ చూసుకొంటానని జైపాల్ రెడ్డి వారికి హామీ ఇస్తున్నట్లు సమాచారం. 

ఈసారి లోక్‌సభ కంటే శాసనసభకు ఆరు నెలల ముందుగా ఎన్నికలు జరుగుతున్నందున కాంగ్రెస్‌ ఎంపీలు అందరూ శాసనసభ ఎన్నికలపోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ ఎన్నికలలో గెలిచి అధికారం దక్కించుకోవడం కాంగ్రెస్ పార్టీకి అత్యవసరం కనుక కాంగ్రెస్‌ అధిష్టానం కూడా అందుకు సై అన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ ఎంపీలలో గెలుపు గుర్రాలను శాసనసభ ఎన్నికల బరిలో దించినట్లయితే ఆ స్థానాలలో టిఆర్ఎస్‌ను సులువుగా ఓడించవచ్చని భావిస్తోంది. కనుక జైపాల్ రెడ్డి శాసనసభ ఎన్నికలలో పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. 

అంగబలం, అర్ధబలం ఉన్న ఎంపిలను శాసనసభ బరిలో దింపాలనే కాంగ్రెస్‌ వ్యూహం వలన టిఆర్ఎస్‌ ఈసారి ఎన్నికలలో గట్టిపోటీయే ఎదుర్కోవలసి రావచ్చు. ఉదాహరణకు మహబూబ్‌నగర్‌ నుంచి టిఆర్ఎస్‌ తరపున శ్రీనివాస్ గౌడ్ పోటీ చేయబోతున్నారు. ఒకవేళ అక్కడి నుంచి జైపాల్ రెడ్డి పోటీ చేసినట్లయితే గెలుపు కోసం శ్రీనివాస్ గౌడ్ మరింత శ్రమించవలసి ఉంటుంది. ఎందుకంటే, గతంలో కేంద్రమంత్రిగా చేసి, ఇప్పుడు ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని చెప్పుకొంటున్న ఆయన శ్రీనివాస్ గౌడ్ చేతిలో ఓడిపోతే తీరని అప్రదిష్ట. కనుక ఆయన ఎట్టిపరిస్థితులలోను శ్రీనివాస్ గౌడ్ ను ఓడించేందుకు ప్రయత్నించడం ఖాయం. కనుక ఈసారి కాంగ్రెస్‌ ఎంపీలు పోటీ చేయబోతున్న అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్‌-టిఆర్ఎస్‌ల మద్య పోటీ చాలా తీవ్రంగా ఉండబోతోంది.


Related Post