ఆ సంగతి తెలియకనే అమిత్ షా ప్రశ్నిస్తున్నారా?

September 16, 2018


img

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం తెలంగాణా పర్యటనకు వచ్చినపుడు, “ఇదివరకు జమిలి ఎన్నికలకు సై అన్న సిఎం కెసిఆర్‌ ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళుతున్నారు?” అని ప్రశ్నించి మళ్ళీ దానికి సమాధానం కూడా ఆయనే చెప్పుకొన్నారు. ముందస్తు ఎన్నికలు, ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల వలన వేలకోట్లు ప్రజాధనం వృధా అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

సిఎం కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనుకొంటున్నట్లు మొదట ప్రధాని మోడీకి చెప్పి ఆయన అనుమతి తీసుకొన్న సంగతి అమిత్ షాకు తెలియదనుకోలేము. అలాగే ప్రజాధనం వృధా కాకూడదనే ఉద్దేశ్యంతోనే ప్రధాని మోడీయే జమిలి ఎన్నికల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి దానిపై దేశవ్యాప్తంగా చర్చింపజేశారు. కనుక ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళుతున్నారని సిఎం కెసిఆర్‌ను ప్రశ్నించే బదులు, ఆయనను ఎందుకు అనుమతించరని అమిత్ షా ప్రధాని మోడీని అడిగితే బాగుండేది. ప్రజాధనం వృధాకావొద్దని అనుకొన్న ప్రధాని మోడీ ముందస్తు ఎన్నికలకు అనుమతించారని అడిగితే బాగుంటుంది కదా? ఒకవేళ ప్రధాని మోడీ అంగీకరించనట్లయితే సిఎం కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లగలిగి ఉండేవారా? కనుక ముందస్తు ఎన్నికలకు సిఎం కెసిఆర్‌కు ఎంత బాధ్యులో, ప్రధాని మోడీ కూడా అంతే బాధ్యులని అమిత్ షా అంగీకరిస్తే బాగుంటుంది. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే, ముందస్తు ఎన్నికలు సరికాదని వాదిస్తున్న అమిత్ షా, అధికారం తమ చేతిలో ఉంచుకొని వాటిని ఆపే ప్రయత్నం చేయకుండా ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టి, మళ్ళీ ముందస్తు ఎన్నికలు ఎందుకు? అని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉంది. 


Related Post