కేటీఆర్‌ అలా ఎందుకు అన్నారో?

September 15, 2018


img

మంత్రి కేటీఆర్‌ ఒక ప్రముఖ తెలుగు మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ‘105 మంది టిఆర్ఎస్‌ అభ్యర్ధులకు  తప్పకుండా బి-ఫారంలు లభిస్తాయా?’ అనే విలేఖరి ప్రశ్నకు “దీనికి సమాధానం మా పార్టీ అధ్యక్షుడు కెసిఆరే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆయన వారి పేర్లను ప్రకటించారు. ఒకవేళ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఆవిషయం ఆయనే చెప్పాలి,” అని జవాబు చెప్పారు. 

టిఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కెసిఆర్‌ ప్రకటించిన 105 మంది అభ్యర్ధులకు తప్పకుండా బి-ఫారంలు లభిస్తాయనే గ్యారెంటీ లేదు. నామినేషన్స్ వేసేలోగా ఎంతమందిని తప్పిస్తారో ఎవరికీ తెలియదు. నా మాట తప్పయితే, 105 మంది అభ్యర్ధులకు తప్పకుండా బి-ఫారంలు ఇస్తామని కెసిఆర్‌ బహిరంగ ప్రకటన చేయాలి,” అని కొండా సురేఖ సవాలు విసిరారు. 

టిఆర్ఎస్‌లో మొదలైన అసమ్మతిని, నేటికీ టిఆర్ఎస్‌లో చేరేందుకు క్యూకడుతున్నవారిని చూస్తుంటే కొండా సురేఖ వాదనకు బలం చేకూరుతోంది. అయితే సిఎం కెసిఆర్‌ స్వయంగా అభ్యర్ధులందరికీ ఫోన్లు చేసి అందరికీ బి-ఫారంలు ఇస్తానని నిశ్చింతగా ఎన్నికల ప్రచారం చేసుకోమని చెప్పడంతో టిఆర్ఎస్‌ అభ్యర్ధులకు కాస్త ఉపశమనం కలిగింది. 

టిఆర్ఎస్‌లో టికెట్ల పంపిణీ ప్రక్రియ దాదాపు పూర్తయినప్పటికీ ఇంకా ఇతర పార్టీల నుంచి నేతలు పార్టీలో చేరేందుకు క్యూ కడుతుండటం గురించి అడిగిన ప్రశ్నకు, “రాబోయే ఎన్నికలలో మాపార్టీయే తప్పకుండా గెలుస్తుందనే నమ్మకంతోనే చాలా మంది టిఆర్ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు,” అని మంత్రి కేటీఆర్‌ సమాధానం చెప్పారు. కానీ సురేశ్ రెడ్డి, దానం నాగేందర్ వంటివారు కేవలం టిఆర్ఎస్‌కు సేవ చేసేందుకే బేషరతుగా ఆ పార్టీలో చేరారంటే నమ్మశఖ్యంగా లేదు. కనుక టిఆర్ఎస్‌లో అభ్యర్ధులు అందరూ నామినేషన్స్ వేసే వరకు ఏదైనా జరుగవచ్చని భావించవచ్చు. 


Related Post