అధికారమే లక్ష్యం అయినప్పుడు....

September 15, 2018


img

జాతీయ పార్టీలతో సహా దేశంలో దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలకు కూడా ఇతర పార్టీలతో ఎన్నికల పొత్తులు అనివార్యమవుతున్నాయిప్పుడు. కొన్ని పార్టీలు బహిరంగంగానే పొత్తులు పెట్టుకొంటుంటే కొన్ని రహస్య అవగాహనతో కధ నడిపించేస్తున్నాయి. 

ప్రస్తుతం తెలంగాణాలో కాంగ్రెస్‌-టిడిపి పొత్తులపై చాలా చర్చలు, వాదోపవాదాలు, విమర్శలు కొనసాగుతున్నాయి. అవి రెండు రాజకీయంగా బద్దశత్రువులు కావడమే అందుకు కారణం. రాజకీయాలలో శాస్విత శత్రువులు, శాస్విత మిత్రులు ఉండరని చెప్పేందుకు కాంగ్రెస్‌-టిడిపిల కొత్త స్నేహం, టిడిపి-బిజెపిల శతృత్వమే ఒక చక్కటి ఉదాహరణ. అధికారమే లక్ష్యంగా మారినప్పుడు పార్టీల సిద్దాంతాలు అటకెక్కుతాయి కనుక ఎవరెన్ని విమర్శలు చేస్తున్నా కాంగ్రెస్‌-టిడిపిలు పొత్తులకే మొగ్గు చూపుతున్నాయి. 

అయితే టిఆర్ఎస్‌ కూడా ఇందుకు అతీతం కాదని చెప్పవచ్చు. రాష్ట్ర స్థాయిలో బిజెపిని శత్రువుగా భావిస్తున్నప్పటికీ అది కేంద్రంతో చక్కటి స్నేహసంబంధాలు కొనసాగిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. అది ప్రభుత్వపరంగా సహకరించుకోవడమే తప్ప దానిని రాజకీయ స్నేహంగా చూడరాదని టిఆర్ఎస్‌ వాదన. కానీ ప్రభుత్వానికి, పార్టీలకు మద్య ఉండాల్సిన సన్నటిగీత చెరిగిపోయినప్పుడు, ప్రభుత్వాలను నడిపే పార్టీల మద్య స్నేహం లేదా రహస్యఅవగాహన లేదంటే నమ్మశక్యంగా లేదు. 

ఒకపక్క బిజెపితో స్నేహం కొనసాగిస్తూనే మరోపక్క దానిని తీవ్రంగా ద్వేషించే మజ్లీస్ పార్టీతో కూడా అంతే బలమైన స్నేహ సంబందాలు కొనసాగించగలగడం కెసిఆర్‌ రాజకీయ చతురతకు అద్దం పడుతోంది. అందుకే టిఆర్ఎస్‌కు ఓటేస్తే మోడీకి ఓటేసినట్లేనని కాంగ్రెస్‌, మజ్లీస్ కు వేసినట్లేనని బిజెపి వాదిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. 

ఈవిధంగా దాదాపు అన్ని పార్టీలు ఏదో ఒక పార్టీతో బహిరంగంగానో రహస్యంగానో పొత్తులు లేదా స్నేహం కొనసాగిస్తూనే, ఇతర పార్టీల పొత్తులను అనైతిక పొత్తులని వాదిస్తుండటం మరో విశేషం. పొత్తులు పెట్టుకొన్న ఆ పార్టీలపై ప్రజలకు వ్యతిరేకత ఏర్పడేలా చేసి ఎన్నికలలో వాటిని చావుదెబ్బ తీయడం కోసమే పొత్తులపై ఈ విమర్శలు కొనసాగుతున్నాయని భావించవచ్చు. అయినా ‘అనైతిక పొత్తులు’ అనే వాదనతో రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నప్పుడు ఇక నైతికత ఎక్కడ మిగిలుంది? ఒకప్పుడు ప్రజాసేవ తమ లక్ష్యం అని చెప్పుకొనే పార్టీలు ఇప్పుడు అధికారమే తమ లక్ష్యం అని నిసిగ్గుగా చెప్పుకొంటున్నప్పుడు కనుక పొత్తులలో నైతికం, అనైతికం అని ఆలోచించడం అంటే కంబళిపై కూర్చొని అన్నం తింటూ వెంట్రుకలను ఏరుకోవడమే అవుతుంది.


Related Post