కాంగ్రెస్‌కి పొత్తులు కావాలి కానీ...

September 15, 2018


img

ఈ నాలుగేళ్ళలో తెలంగాణాలో టిఆర్ఎస్‌ చాలా శక్తివంతంగా మారగా ప్రతిపక్షాలు చాలా బలహీనపడ్డాయి. కారణాలు అందరికీ తెలుసు. కనుక త్వరలో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఎదుర్కొని ఓడించేందుకు కాంగ్రెస్‌, టిడిపి, సిపిఐ, తెలంగాణా జనసమితిలు ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలని నిర్ణయించుకొన్నాయి. అయితే ఏకం కావాలనుకోవడం చాలా తేలికే కానీ సీట్లు సర్ధుబాట్లు చేసుకోవడమే చాలా కష్టం. పొత్తుల కోసం సీట్లు సర్దుబాటు చేసుకోవాలంటే అన్ని పార్టీలు తమకు ముఖ్యమైన కొన్ని సీట్లను త్యాగం చేయక తప్పదు. చేస్తే ఆ స్థానాల నుంచి పోటీ చేయాలనుకొంటున్నవారు అసంతృప్తి చెంది అలకపాన్పు ఎక్కకమానరు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే సమస్య ఎదుర్కొంటోంది. 

టిడిపి, సిపిఐ, తెలంగాణా జనసమితిలు కాంగ్రెస్‌కు బాగా బలమున్న చోట, బలమైన అభ్యర్ధులున్న స్థానాలను కోరుతున్నాయి. టిఆర్ఎస్‌ను ఓడించేందుకు ఇతర పార్టీల మద్దతు అవసరమే కానీ ముఖ్యమైన సీట్లన్నీ వాటికే పంచిపెట్టేస్తే ఇక కాంగ్రెస్ పార్టీకి ఏమి ప్రయోజనం? అందుకే తమకు బలమైన అభ్యర్ధులున్న స్థానాలను మిత్రపక్షలకు ఇవ్వకూడదని, బలహీనంగా ఉన్న స్థానాలను మాత్రమే ఇవ్వాలని రాహుల్ గాంధీ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు సూచించారు. కానీ అందుకు టిడిపి, టిజెఎస్, సిపిఐ పార్టీలు ఒప్పుకొంటాయని అనుకోవడం అత్యాసే అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్ధులున్న కొన్ని స్థానాలలోనే టిడిపి, సిపిఐలకు కూడా అభ్యర్ధులున్నారు. కనుక అవి కూడా ఆ స్థానాలను వదులుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. 

సీట్ల సర్దుబాటులో పట్టువిడుపులు చాలా అవసరం కానీ కాంగ్రెస్ పార్టీ తాజా వైఖరి అందుకు విరుద్దంగా ఉంది. పైగా టిడిపితో పొత్తులే వద్దని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డివంటి సీనియర్ నేతలు గట్టిగా వాదిస్తున్నారు. కనుక కాంగ్రెస్‌, టిడిపి, సిపిఐ, తెలంగాణా జనసమితిల మద్య ఎన్నికల పొత్తులు కుదురుతాయో లేదో చూడాలి. కాంగ్రెస్-టిడిపి పొత్తులపై  తెరాస, బిజెపిలు ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ ముందుకే సాగుతున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మనసు మార్చుకొని వెనక్కు తిరిగినా విమర్శలు ఎదుర్కొక తప్పదు. కనుక కష్టమైన నష్టమైనా ముందుకే సాగక తప్పదు. 


Related Post