బాబుగారు ఆ ట్రాప్‌లో చిక్కుకోవద్దు: శివాజి

September 14, 2018


img

నటుడు శివాజి ఈరోజు మళ్ళీ మరో బాంబు పేల్చారు. ఈరోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “ఒకవేళ చంద్రబాబు నాయుడు ధర్మాబాద్ కోర్టు విచారణకు హాజరైతే త్వరలో మరో రెండు మూడు నోటీసులు అందుకోవలసి వస్తుంది. కనుక ఆ ట్రాప్‌లో చిక్కుకోవద్దని సలహా ఇస్తున్నాను. ఈ సమస్య నుంచి బయటపడటానికి అవసరమైతే న్యాయ నిపుణుల సలహాలు తీసుకోండి కానీ భావోద్వేగంతో ముందుకుపోతే కేంద్రప్రభుత్వం పన్నిన వలలో చిక్కుకోవడం ఖాయం, “ అని శివాజీ హెచ్చరించారు. 

ఇంతకు ముందు తాను చేసిన హెచ్చరికలపై అవహేళన చేస్తూ మాట్లాడిన వైకాపా నేత శ్రీకాంత రెడ్డికి కూడా చాలా ఘాటుగా జవాబు చెప్పారు. “నేను సినిమాలు లేక పనీ పాట లేకుండా తిరుగుతూ ఏవో నోటికి వచ్చినట్లు అవాకులు చావాకులు వాగుతున్నానని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. నిజమే అనుకోండి. మీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా పనీ పాటు ఉందా?అధికార దాహంతోనే కదా శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా పాదయాత్రలు చేస్తున్నారు? పాదయాత్రలో ఆయన చేస్తున్న డ్రామాలను ఎవరూ చూడటం లేదనుకొన్నారా? ఆయనేమన్నా గాంధీ మహాత్ముడా...ఆయన వెనుక లక్షలాది ప్రజలు తరలి రావడానికి? ప్రజలకేమీ పనీపాటు ఉండదనుకొంటున్నారా? వైకాపాతో సహా రాజకీయ పార్టీలన్నీ చేసేది పక్కా వ్యాపారమే. ఎన్నికలలో పోటీ చేయడం మొదలు ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలను ఏదో విధంగా కూలద్రోయడం వరకు అంతా వ్యాపారమే. కానీ అందరూ నీతులు వల్లె వేస్తుంటారు.

ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాన్ని కూల్చాలని జగన్మోహన్ రెడ్డికి అంత ఆరాటం దేనికి? ఏం మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు ఆగలేరా? మీరు సిఎం కుర్చీలో కూర్చోవడం కోసం ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం కూలిపోవాలా? జనవరిలో ఏపీలో ఎన్నికలు వస్తాయని మీరు ఏవిధంగా చెపుతున్నారు? అంటే ఆలోగా ఈ కేసులలో బాబుని ఇరికించి జైలుకు పంపించేసి, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించేసి ఎన్నికలు జరిపించబోతున్నారని మీరు చెపుతున్నారా? పదవి, అధికారం కోసం మరీ ఇంతగా దిగజారిపోవాలా?” అని శివాజీ నిప్పులు చెరిగారు.                   

కేంద్రప్రభుత్వం కుట్రలా గురించి మాట్లాడుతూ, “దేశంలో చంద్రబాబు నాయుడు ఒక్కరే ధైర్యంగా నిలబడి ప్రధాని మోడీతో పోరాడుతున్నారు. అందుకే చంద్రబాబును ఏదో విధంగా ఒంటరిని చేసి, అణగద్రోక్కేయాలని పెద్ద కుట్ర మొదలైంది. చంద్రబాబు నాయుడు తనకున్న పరిచయాలతో ఏపీకి యాపిల్ కంపెనీని తీసుకు వస్తుంటే కేంద్రం అడ్డుపడి దానిని వేరే రాష్ట్రానికి తరలించుకొనిపోయిన మాట వాస్తవమా కాదా? మీ రాజకీయాలకు, అధికార దాహానికి రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు అందరూ బలైపోవలసిందేనా?” అని శివాజీ నిప్పులు చెరిగారు. 


Related Post