కెసిఆర్‌పై ఉత్తమ్ తీవ్ర ఆరోపణలు

September 13, 2018


img

నకిలీ పాస్ పోర్టుతో అక్రమంగా మనుషులను అమెరికాకు పంపించినందుకు కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించడంతో సిఎం కెసిఆర్‌పై కాంగ్రెస్‌ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. సిఎం కెసిఆర్‌, మంత్రి హరీష్ రావు ఇద్దరూ కూడా నకిలీ పాస్ పోర్టుతో అక్రమంగా మనుషులను అమెరికాకు పంపించారని, వారిపై తక్షణమే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి నిన్న ఆరోపించగా, టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంగారెడ్డిలో జరిగిన సభలో మాట్లాడుతూ, “సిఎం కెసిఆర్‌ మొత్తం 8 మందిని, మంత్రి హరీష్ రావు ఒక్కరినీ నకిలీ పాస్ పోర్టుతో అమెరికాకు పంపించారని ఆరోపించారు. అందుకు ఆయన సాక్ష్యాధారాలను కూడా చూపించారు. వారిరువురిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవలసిన డిజిపి మహేందర్ రెడ్డి వారిని పట్టించుకోకుండా, కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డిని అరెస్ట్ చేయించడాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పు పట్టారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోందని అప్పుడు సిఎం కెసిఆర్‌, డిజిపిలతో సహా వారిరువురికీ సహకరిస్తున్న అధికారులు అందరిపై చట్టప్రకారం చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. 

కాంగ్రెస్ పార్టీ టిడిపితో పొత్తులు పెట్టుకోవడాన్ని తప్పు పడుతున్న సిఎం కెసిఆర్‌, ఒకే సమయంలో భిన్నదృవాలైన బిజెపి, మజ్లీస్ రెండు మతతత్వ పార్టీలతో పొత్తులుపెట్టుకొని ముందుకు సాగుతునారని విమర్శించారు. సిఎం కెసిఆర్‌ ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్లు కల్పిస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. 

సిఎం కెసిఆర్‌, మంత్రి హరీష్ రావులపై కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఈ తీవ్రఆరోపణలపై టిఆర్ఎస్‌ నేతలు ఇంతవరకు స్పందించలేదు. ఒకవేళ వారు ఈ ఆరోపణలను ఖండించకపోయినట్లయితే వాటిని అంగీకరించినట్లవుతుంది. కాదని ఖండిస్తే కాంగ్రెస్‌ నేతలు ఇంకా రెచ్చిపోయి కోర్టుకు వెళితే టిఆర్ఎస్‌కు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి రాచ్చు. ఈ కేసుతో జగ్గారెడ్డిని కట్టడి చేయాలని సిఎం కెసిఆర్‌ భావిస్తే అది ఈవిధంగా బ్యాక్ ఫైర్ అవడం విశేషమే.


Related Post