టిఆర్ఎస్‌ అభ్యర్ధులకు శుభవార్త

September 13, 2018


img

టిఆర్ఎస్‌ అభ్యర్ధుల తొలి జాబితా ప్రకటించినప్పటి నుంచి ఆ పార్టీలో అసమ్మతి సెగలు రాజుకొన్నాయి. అనేక నియోజకవర్గాలలో టికెట్ ఆశించి భంగపడిన టిఆర్ఎస్‌ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేయడానికి సిద్దపడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. పతాకస్థాయికి చేరిన  అసమ్మతిని చూసి, టికెట్ దక్కించుకొన్నవారు చాలా కంగారు పడుతున్నారు. పార్టీ అధిష్టానంపై అసమ్మతివాదుల ఒత్తిడి మరింత పెరిగితే తమకు ఇచ్చిన టికెట్లు వెనక్కు తీసుకొని వారికి ఎక్కడ కట్టబెడతారోననే భయంతో కొందరు అభ్యర్ధులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

పార్టీలో చెలరేగుతున్న అసమ్మతిని నిశితంగా గమనిస్తున్న సిఎం కెసిఆర్‌ స్వయంగా పార్టీ అభ్యర్ధులకు ఫోన్లు చేసి వారి టికెట్లకు డోకా లేదని నిశ్చింతగా ఎన్నికల ప్రచారం చేసుకోమని భరోసా ఇస్తున్నారు. అభ్యర్ధులను ఖరారు చేసేటప్పుడు అన్ని కోణాలలో ఆలోచించి, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొనే పేర్లు ఖరారు చేశామని కనుక ఇక ఎవరు ఎంత ఒత్తిడి చేసినా అభ్యర్ధులను మార్చే ప్రసక్తే లేదని చెప్పారు. తొలి జాబితాలో ప్రకటించిన 105 మంది అభ్యర్ధులందరికీ తప్పకుండా బి-ఫారంలు ఇస్తానని, వాటి గురించి మీడియాలో వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని సిఎం కెసిఆర్‌ స్పష్టం చేయడంతో టిఆర్ఎస్‌ అభ్యర్ధులలో మళ్ళీ కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? బి- ఫారంలు ఎప్పుడు చేతికి వస్తాయి? ఎన్నికలలో గెలుస్తామా లేదా? వంటి ఆలోచనలు, అనుమానాలు పెట్టుకోకుండా అభ్యర్ధులు అందరూ ఆత్మవిశ్వాసంతో తమ తమని నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం చేసుకోవాలని సిఎం కెసిఆర్‌ వ్యక్తిగతంగా ఫోన్ చేసి చెపుతుండటంతో అభ్యర్ధులు సమరోత్సాహంతో బరిలోకి దిగుతున్నారు. 

సిఎం కెసిఆర్‌ చెప్పిన దానిని బట్టి ఇక టిఆర్ఎస్‌ అభ్యర్ధులను మార్చే అవకాశం లేదని స్పష్టం అయ్యింది కనుక టికెట్ లభించక తీవ్ర ఆగ్రహం, అసంతృప్తితో రగిలిపోతున్నవారి ముందు మూడే మార్గాలు మిగిలాయి. 1. తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని కట్టిపెట్టి పార్టీ అభ్యర్ధులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని పార్టీలో తమ స్థానం సుస్థిరం చేసుకోవాలి. 2. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయడం. 3. వేరే పార్టీలోకి మారడం. అయితే ముందుగా వారు తమ శక్తి సామర్ధ్యాలను, పార్టీల బలాబలాలను సరిగ్గా అంచనా వేసి తగిన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.


Related Post