బాల్క సుమన్‌కు షాక్

September 12, 2018


img

టిఆర్ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌కు చెన్నూరు నుంచి శాసనసభకు పోటీ చేసేందుకు టికెట్ లభించినందున ఇవాళ్ళ మొట్టమొదటిసారిగా అక్కడికి ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు చాలా చేదు అనుభవం ఎదురైంది. ‘సుమన్ గో బ్యాక్’ కొందరు యువకులు ఆయనను అడ్డుకొన్నారు. వారిలో గత్తయ్య అనే వ్యక్తి ‘చెన్నూరులో ఓపెన్ కాస్ట్ గని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ’ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. సుమన్‌పై కూడా పెట్రోల్ చల్లబోయాడు. కానీ సుమన్ తప్పించుకొన్నాడు. ఈ ప్రమాదంలో గట్టయ్యతో పాటు మరో ముగ్గురికి  గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు మంటలు ఆర్పి వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.  

ఆ స్థితిలో కూడా గట్టయ్య “నల్లా ఓదెయ్య జిందాబాద్...ఓదెయ్యాకే టికెట్ ఇవ్వాలి. సుమన్ ఓదెయ్యను అన్యాయం చేస్తున్నాడు” అంటూ నినాదాలు చేయడంతో అతను ఓదెయ్య అనుచరుడనే సంగతి బయటపడింది. కనుక ఓపెన్ కాస్ట్ గని ఏర్పాటును వ్యతిరేకించడం సాకుగా వాడుకొని వారు సుమన్‌ను అడ్డుకొనే ప్రయత్నించినట్లు స్పష్టం అవుతోంది.

ఈ ఘటనపై సుమన్ స్పందిస్తూ, “ఓదెల అనుచరులు నాపై పెట్రోల్ పోసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. కానీ సమయానికి నా అనుచరులు, పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాను. సిఎం కెసిఆర్‌ నాకు చెన్నూరు నుంచే పోటీ చేయడానికి టికెట్ ఇచ్చారు కనుకనే నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తాను. సిఎం కెసిఆర్‌ శిష్యుడినైన నేను ప్రజల ఆశీర్వాదంతో  భారీ మెజార్టీతో విజయం సాధించి చూపుతాను. టికెట్ విషయంలో నల్లా ఓదెలుకు ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే నేరుగా సిఎం కెసిఆర్‌కు చెప్పుకోవాలి కానీ తన అనుచరులచేత ఈవిధంగా చేయించడం సరికాదు,” అని అన్నారు. 

సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని బల్క సుమన్‌కు టికెట్ కేటాయించినందుకు గత రెండు రోజులుగా నల్లా ఓదెలు అలకపూనారు. ఈ వ్యవహారం తేలకమునుపే బాల్క సుమన్‌ తన అనుచరులతో కలిసి చెన్నూరులో ఎన్నికల ప్రచారానికి తరలిరావడంతో నల్లా ఓదెలు వర్గం భగ్గుమంది. అయితే టిఆర్ఎస్‌ అభ్యర్ధి తొలి ఎన్నికల ప్రచారసభలో ఓదెలు అనుచరులు ఇటువంటి దుందుడుకు చర్యకు పాల్పడటం వలన ఆయనకు టికెట్ లభించకపోగా పార్టీ నుంచి బహిష్కరింపబడే అవకాశం ఉందిప్పుడు.


Related Post