కొండా సురేఖ చెప్పిందే జరుగబోతోందా?

September 12, 2018


img

టిఆర్ఎస్‌ అభ్యర్ధుల తొలి జాబితా ప్రకటించిన తరువాత ఆ పార్టీలో అసమ్మతి సెగలు మొదలయ్యాయి. సిఎం కెసిఆర్‌కు నమ్మిన బంటుగా పేరొందిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తనకు టికెట్ ఇవ్వనందుకు నిరసనగా స్వయంగా గృహనిర్బందం విధించుకొని రెండు రోజులుగా ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. ఆయన స్థానంలో ఎంపీ బాల్కా సుమన్ కు టికెట్ కేటాయించడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. 

అనూహ్యంగా స్టేషన్‌ఘన్‌పూర్‌ టికెట్ సాధించుకొన్న టి.రాజయ్య రాసలీలలు బయటపడటంతో అప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా రాజుకొంటున్న అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది. రాజయ్యకు టికెట్ ఇవ్వరాదని స్థానిక టిఆర్ఎస్‌ నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు.   

టిడిపి నుంచి వచ్చిన తీగల కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వడంతో మహేశ్వరంలో టిఆర్ఎస్‌ నేతలు నిన్న రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. మొదటి నుంచి టిఆర్ఎస్‌లోనే ఉన్న కొత్త మనోహర రెడ్డికి టికెట్ ఇవ్వాలని లేకపోతే స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేయడం ఖాయమని ప్రకటించేశారు. 

ఇక కొండా సురేఖ సంగతి అందరికీ తెలిసిందే. ఆమె పరకాల నుంచి, ఆమె కుమార్తెను వరంగల్ తూర్పు నుంచి స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేయడానికి సిద్దం అవుతున్నారు.

ఇతర పార్టీలలో నుంచి టిఆర్ఎస్‌లోకి వచ్చి టికెట్లు సంపాదించుకొన్నవారిపై టిఆర్ఎస్‌ నేతలు మండిపడుతున్నారు. అయినా ఇంకా సురేశ్ రెడ్డి వంటి కాంగ్రెస్‌ నేతలను టిఆర్ఎస్‌లోకి రప్పిస్తూనే ఉండటం విశేషం. టిఆర్ఎస్‌లో రగులుతున్న ఈ అసమ్మతి సెగలు చూస్తుంటే, కొండా సురేఖ చెప్పినట్లుగా మొదటి జాబితాలోని 105 మంది అభ్యర్ధులలో ఎంతమంది చేతికి  బి-ఫారంలు వస్తాయో లేదో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. 


Related Post