రాష్ట్రపతిని కలిసినా ఏం ప్రయోజనం?

September 12, 2018


img

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నేతలు మంగళవారం గవర్నర్ నరసింహన్‌ను కలిసి కెసిఆర్‌ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. కెసిఆర్‌, ఆయన మంత్రులు  అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాలంటే కెసిఆర్‌ను తక్షణం ఆ పదవి నుంచి తొలగించాలని వారు కోరారు. 

సిఎం కెసిఆర్‌ శాసనసభను రద్దు చేయగానే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం, ఎన్నికల కమీషన్ హడావుడిగా ఓటర్ల జాబితా గడువును కుదించి ముందస్తు ఎన్నికలకు సిద్దం అవుతుండటం, దాని వలన రాష్ట్రంలో సుమారు 20 లక్షల మందికి ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం లేకపోవడం వంటి అంశాలనన్నిటినీ కూడా వారు గవర్నర్ నరసింహన్‌ దృష్టికి తీసుకు వెళ్ళారు. అయితే ముందే ఊహించినట్లుగా ఆయన పద్దతి ప్రకారం వారిచ్చిన వినతిపత్రాన్ని తీసుకొని వారితో ఫోటో దిగారు కానీ సానుకూలంగా స్పందించలేదు. ఈ విషయం ఆయనను కలిసి వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదండరామ్, చాడా వెంకట్ రెడ్డి తదితరులు మీడియాలు తెలిపారు. 

సిఎం కెసిఆర్‌ రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తాము గవర్నర్ నరసింహన్‌కు పిర్యాదు చేసినప్పటికీ ఆయన ఏమాత్రం పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనుక త్వరలో డిల్లీ వెళ్ళి రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను కలిసి సిఎం కెసిఆర్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతామని తెలంగాణా జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ చెప్పారు. 

అయితే అక్కడ కూడా వారికి అదే చేదు అనుభవం ఎదురుకావడం ఖాయం. ఎందుకంటే, ప్రధాని మోడీ ఆమోదంతోనే సిఎం కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్లు  ఆయనకు కూడా తెలుసు కనుక ఆయన కూడా ప్రతిపక్షాల అభ్యర్ధనను పట్టించుకోరని ఖచ్చితంగా చెప్పవచ్చు. కనుక ప్రతిపక్షాలకు ఇక మిగిలినా ఏకైక మార్గం న్యాయస్థానాన్ని ఆశ్రయించడమే. వారు  రాష్ట్రపతిని కలిసి వచ్చిన తరువాత హైకోర్టులో పిటిషన్ వేయడం కూడా ఖాయమేనని భావించవచ్చు.  


Related Post