పొత్తులా...మజాకా?

September 11, 2018


img

కాంగ్రెస్‌-టిడిపిలు పొత్తులు పెట్టుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకొన్నప్పుడు ఎవరు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ అవి పట్టించుకోలేదు. కానీ సీట్లు సర్ధుబాట్లు చేసుకొనే సమయం వచ్చేసరికి ఇల్లలకగానే పండుగ కాదని అందరికీ అర్ధమవుతోంది.

సీట్ల సర్దుబాటులో భాగంగా టిడిపి గత ఎన్నికలలో గ్రేటర్ పరిధిలో గెలిచిన సనత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, కంటోన్మెంట్‌, ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, రాజేంద్రనగర్‌, మహేశ్వరం 9 నియోజకవర్గాలను మళ్ళీ తమకే ఇవ్వాలని టిడిపి పట్టుబడుతోంది. వాటికి ఆధనంగా ఈసారి ఉప్పల్ నియోజకవర్గాన్ని కూడా తమకే కేటాయించాలని పట్టుబడుతోంది. 

ఫిరాయింపులు ఇతర కారణాల చేత బలహీనపడిన టిడిపితో పొత్తుల కోసం ఒక్క గ్రేటర్ పరిధిలోనే అన్ని సీట్లు వదులుకోవడానికి కాంగ్రెస్‌ నేతలు ఇష్టపడటం లేదు. దాని వలన కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని భయపడుతున్నారు. ఉప్పల్ స్థానం టిడిపికి ఇచ్చేందుకు సిద్దపడితే అక్కడి నుంచి పోటీ చేయాలనుకొంటున్న కాంగ్రెస్‌ నేత లక్ష్మారెడ్డి తన అనుచరులతో కలిసి తక్షణం పార్టీకి గుడ్ బై చెప్పేసి టిఆర్ఎస్‌లో చేరిపోతానని హెచ్చరించినట్లు సమాచారం. 

ఇక శేరిలింగంపల్లి నుంచి భిక్షపతి యాదవ్, మహేశ్వరం నుంచి సబిత, కుత్బుల్లాపూర్ నుంచి శ్రీశైలం గౌడ్, సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి, జూబ్లీ హిల్స్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి పోటీ చేయాలనే ఉద్దేశ్యంతో చిరకాలంగా ఆయా నియోజక వర్గాలలో  కాంగ్రెస్‌ పార్టీ తరపున పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

ఆ సమయంలో టిడిపితో పొత్తుల ఆలోచనే రాలేదు కనుక వారు అక్కడి నుంచి పోటీ చేయడానికి ఎటువంటి సమస్య కనిపించలేదు. కానీ ఇప్పుడు టిడిపితో పొత్తుల కోసం ఆ స్థానాలను త్యాగం చేయమంటే వారు అంగీకరిస్తారని అనుకోలేము. 

గ్రేటర్ పరిధిలో సీట్ల సర్ధుబాట్లలోనే ఇన్ని సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఇక అన్ని జిల్లాలలో సర్ధుబాటు చేసుకోవడం ఎంత కష్టమో, అందుకు ఎన్ని త్యాగాలు చేయాలో ఊహించవచ్చు. అదీగాక కాంగ్రెస్ పార్టీ ఇంకా తెలంగాణా జనసమితి, వామపక్షాలతో కూడా ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. అంటే వాటి కోసం మరిన్ని సీట్లు త్యాగం చేయడానికి సిద్దపడాలన్న మాట. 

కాంగ్రెస్ పార్టీ అందుకు సిద్దపడవచ్చు కానీ గత నాలుగేళ్ళుగా ఈ ఎన్నికల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్న కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు టిడిపి, తెలంగాణా జనసమితి కోసం త్యాగాలు చేయమంటే చేస్తారా? అంటే అనుమానమే. మరి వాటితో పొత్తులు ఎలా సాధ్యం? అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం లభిస్తుంది.


Related Post