నల్లా ఓదేలు తిరుగుబాటుకు సిద్దం?

September 11, 2018


img

సిఎం కెసిఆర్‌ 105 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించి, తనకు టికెట్ నిరాకరించినందుకు చెన్నూరు మాజీ టిఆర్ఎస్‌ శాసనసభ్యుడు నల్లాల ఓదేలు తీవ్రమనస్తాపం చెందారు. ఉద్యమ సమయం నుంచి కెసిఆర్‌ వెంట నడుస్తూ టిఆర్ఎస్‌ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన తనకు టికెట్ నిరాకరించడాన్ని నల్లా ఓదేలు జీర్ణించుకోలేకపోతున్నారు. తనను కాదని స్థానికేతరుడైన  బాల్కా సుమన్ (ఎంపీ)కు సిఎం కెసిఆర్‌ టికెట్ కేటాయించడంపై ఆయన తీవ్ర ఆగ్రహంతో, ఆవేదనతో రగిలిపోతున్నారు. సిఎం కెసిఆర్‌ను కలిసి బాధను చెప్పుకొందామని ప్రయత్నించినప్పటికీ తనకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం మరొక అవమానంగా భావిస్తున్నారు. 

తీవ్ర మనస్తాపంతో బాధపడుతున్న ఆయన గత రెండు రోజులుగా మందమర్రిలో తన నివాసం నుంచి బయటకు రావడం లేదు. దాంతో ఆయన అనుచరులు అక్కడకు చేరుకొని ఆయనకు అనుకూల నినాదాలు చేస్తున్నారు. ఒకవేళ ఆయనకు టికెట్ ఇవ్వకపోతే బాల్కా సుమన్ కు ఎన్నికలలో సహకరించబోమని స్పష్టం చెపుతున్నారు. వారితో సమావేశమయిన నల్లాల ఓదేలు కూడా పార్టీపై తిరుగుబాటుకు సిద్దం  అవుతున్నట్లు సమాచారం. ఒకవేళ టిఆర్ఎస్‌ టికెట్ ఇవ్వకపోయినట్లయితే స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తాజా సమాచారం. కనుక టిఆర్ఎస్‌ అధిష్టానం, అక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్దపడుతున్న ఎంపీ బాల్కా సుమన్ ముందుగా ఈ సమస్యను పరిష్కరించుకోవలసి ఉంటుంది.


Related Post