రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నేతలు మంగళవారం గవర్నర్ నరసింహన్‌ను కలువనున్నారు. సిఎం కెసిఆర్ తనంతట తానే అధికారం నుంచి దిగిపోయారు కనుక ఎన్నికలు జరిగేవరకు మళ్ళీ ఆయనకే ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడం సరికాదని, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కెసిఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంది కనుక తక్షణం ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలని వారు గవర్నర్ ను కోరనున్నారు. రాష్ట్రంలో గవర్నర్ పాలన లేదా రాష్ట్రపతి విధించి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని వారు గవర్నర్ నరసింహన్‌ను కోరబోతున్నారు.
ఈ విషయంలో ప్రతిపక్షాల వాదన సహేతుకంగానే ఉన్నప్పటికీ సిఎం కెసిఆర్ శాసనసభ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనుకొంటున్నట్లు ప్రధాని మోడీ మరియు గవర్నర్ నరసింహన్‌లకు ముందుగానే తెలియజేసి వారి అంగీకారం పొందారు. అందుకే కేంద్ర ఎన్నికల కమీషన్ కూడా తెలంగాణా శాసనసభ ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. కనుక ప్రతిపక్షాల అభ్యర్ధనను గవర్నర్ నరసింహన్ మన్నిస్తారనుకోలేము.
జమిలి ఎన్నికల గురించి గట్టిగా వాదించిన ప్రధాని మోడీ అందుకు భిన్నంగా సిఎం కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కోరిన్నప్పుడు వారించవచ్చు. కానీ ప్రధాని మోడీ తన వాదనకు తానే తూట్లు పొడుస్తూ ముందస్తు ఎన్నికలకు అనుమతించారు.
ఇక సిఎం కెసిఆర్ తన పార్టీ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఎటువంటి కారణం చూపకుండానే తొమ్మిది నెలల ముందు శాసనసభను రద్దు చేసి ప్రజాతీర్పును పరిహసించారు. ఐదేళ్లు పాలించమని అధికారం కట్టబెడితే మద్యలోనే దిగిపోయి మళ్ళీ అధికారం ఇవ్వాలని ప్రజలను కోరుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ముందస్తు ఎన్నికల వలన వేలకోట్లు ప్రజాధనం వృధా అవుతుందని తెలిసి ఉన్నప్పటికీ ప్రజాధనం కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమనుకోవడం ఇంకా బాధాకరం.
పాలకులు రాజధర్మం పాటించనప్పుడు వారికి తగిన సలహా ఇవ్వవలసిన గవర్నర్ ప్రేక్షకపాత్ర వహించడం విచారకరం.
పార్టీలు, వాటి రాజకీయాలకు అతీతంగా ఎన్నికల కమీషన్ నిష్పక్షపాతంగా, రాజ్యాంగబద్దంగా వ్యవహరించాలనే ఉద్దేశ్యంతోనే మన రాజ్యాంగకర్తలు చాలా ముందు చూపుతో దానిని ఒక స్వతంత్ర సంస్థగా రూపొందించారు. కానీ అది కూడా అధికార పార్టీ కనుసన్నలలో పనిచేస్తూ ఇదివరకు తాను తీసుకొన్న నిర్ణయాలను, ఆలోచనలను మార్చుకొని ముందస్తు ఎన్నికల కోసం చకచకా ఏర్పాట్లు చేస్తుండటం ఇంకా విచారకరం. ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు ప్రతిపక్షాలు చెప్పే మంచి మాటలు ఎవరు పట్టించుకొంటారు? వారిది కంఠశోషే అవుతుంది.